హైదరాబాద్ డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ఐఎంజీ (భారత)కు భూకేటాయింపులపై దాఖలైన పిటిషన్లపై 27న విచారణ చేపడతామని హైకోర్టు ప్రకటించింది. ఇప్పటికే పిటిషన్ దాఖలై 17 ఏండ్లు అవుతున్నదని పేర్కొన్నది. క్రీడా మౌలిక వసతుల కల్పనలో భాగంగా 2003లో అప్పటి టీడీపీ ప్రభుత్వం గచ్చిబౌలిలో 850 ఎకరాలను ఐఎంజీకి కేటాయించింది. కాంగ్రెస్ ప్రభుత్వం 2008లో ఆ ఒప్పందాన్ని రద్దు చేసింది. ఈ నిర్ణయాలను సవాలు చేస్తూ ఐఎంజీ భారత్ తరఫున బిల్లీరావు పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఐఎంజీకి భూ కేటాయింపులను సవాలు చేస్తూ కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిపై చీఫ్ జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసులో ఇంకా తమకు రెండు వారాల గడువు కావాలని అడ్వకేట్ జనరల్ కోరగా, 27వ తేదీకి వాయిదా వేసింది.