హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ తల్లి విగ్రహాల రూపాన్ని మార్చి కొత్త విగ్రహాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలను వెచ్చించడాన్ని తప్పుబడుతూ రచయిత జూలూరి గౌరీశంకర్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యం (పిల్)పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. కొత్త విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం దాదాపు రూ.150 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేయనుండటం సరికాదని గౌరీశంకర్ తరఫు న్యాయవాది వాదించారు. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నదని, ఈ నేపథ్యంలో రూ.150 కోట్ల ప్రజాధనం వృథా కాకుండా అడ్డుకోవాలని, ఆ నిధులను ప్రజాసంక్షేమానికి వినియోగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. కొత్త విగ్రహాల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టలేమని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ప్రజాహిత వ్యాజ్యంలో మార్పులు చేర్పులు చేసి మెరుగైన రీతిలో మళ్లీ దాఖలు చేయాలని చీఫ్ జస్టిస్ అలోక్ అరాథే, జస్టిస్ జే శ్రీనివాసరావు ధర్మాసనం సూచించింది. దీంతో ఆ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుని, సంబంధిత అన్ని అంశాలతో వారం రోజుల్లోగా కొత్త పిల్‌ను దాఖలు చేస్తామని పిటిషనర్ తరఫు సీనియర్ చెప్పడంతో అందుకు ధర్మాసనం అనుమతించింది.