హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : సీజనల్ వ్యాధుల కట్టడిలో భాగంగా ఇంటింటికీ జ్వర సర్వే నిర్వహించి బాధితుల రక్తనమూనాలు సేకరించి మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో సీజనల్ వ్యాధుల కట్టడిపై అన్ని జిల్లాల వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు, డెంగ్యూ కేసులు ఎకువగా నమోదయ్యే హైరిస్ ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధుల కట్టడిలో భాగంగా ఏర్పాటుచేసిన కంట్రోల్‌రూమ్‌కు రోజువారీ రిపోర్టు అందించాలని సూచించారు. సీజనల్ వ్యాధులు, డెంగ్యూ కట్టడిపై హెచ్‌వోడీ, జిల్లా స్థాయిలో డీఎంహెచ్ఓలు క్షేత్రస్థాయిలో పర్యటించి తీసుకుంటున్న చర్యలపై నివేదిక సమర్పించాలని మంత్రి స్పష్టంచేశారు.
ఎలీసా టెస్టు చేయకుండా ర్యాపిడ్ టెస్ట్ ద్వారా డెంగ్యూ నిర్ధారణ చేసి ప్రజలను ఆందోళనకు గురిచేసే దవాఖానలను గుర్తించి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న జీవన్‌దాన్ కార్యక్రమంలో భాగంగా అవయవ మార్పిడిపై చర్చించారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జడ్ చోంగ్తూ, ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్, టీజీఎంఎస్ఐడీసీ ఎండీ హేమంత్ వాసుదేవరావు, ప్రజారోగ్య శాఖ సంచాలకుడు డాక్టర్ రవీందర్‌కుమార్, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ వాణి పాల్గొన్నారు.