హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్ట్ 1 (నమస్తే తెలంగాణ) : దేవాదాయశాఖలో గ్రాంట్ ఇన్ ఎయిడ్ పొందుతున్న అర్చక ఉద్యోగులకు, ధూపదీప నైవేద్య అర్చకులకు ఆరోగ్యబీమాతో పాటు పెన్షన్ సౌకర్యం కల్పించేందుకు ప్రతిపాదనలు పంపాలని దేవాదాయశాఖ డైరెక్టర్ వెంకట్రావు పలు ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులను కోరారు. బొగ్గులకుంటలోని దేవాదాయశాఖ కార్యాలయంలో శుక్రవారం ఆయన పలు ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులతోపాటు రాష్ట్ర అర్చక ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈనెల 8లోగా అర్చక ఉద్యోగుల ఆరోగ్యబీమాకు సంబంధించి లాభదాయకప్రతిపాదనలు ఇవ్వాలని, పెన్షన్ స్కీమ్‌కు సంబంధించి కూడా ప్రతిపాదనలు ఇవ్వాలని చెప్పారు.
ఒకవేళ అర్చక వెల్ఫేర్ ఫండ్‌కు ప్రతిసంవత్సరం వస్తున్న వడ్డీ ఇన్సూరెన్స్ ప్రీమియమ్‌కు సరిపోకపోతే వారి జీతభత్యాల నుంచి ఏమైనా చెల్లించాల్సిన అవసరముంటుందా అన్నది కూడా చర్చించాలని తెలిపారు. మరోవైపు దేవాదాయశాఖలో అర్చక ప్రమోషన్ల విషయం లో సంబంధింత సూపరింటెండెంట్లు, డీ సీలు, ఆర్జేసీలు ప్రమోషన్ల ఫైళ్లను వెంటనే క్లియర్ చేసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ వెంకట్రావును స న్మానించారు. ఏడీసీలు కృష్ణవేణి, శ్రీనివాసరావు, ఆర్జేసీ రామకృష్ణారావు, డీసీఎస్ డీసీ కృష్ణప్రసాద్, వెల్ఫేర్‌బోర్డు సభ్యులు కాండూరి కృష్ణమాచారి, జక్కాపురం నారాయణస్వామి, అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ, తదితరులున్నారు.