హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : నీట్ యూజీ కౌన్సెలింగ్లో ‘స్థానికత’ వివాదానికి సంబంధించి ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కోర్టును ఆశ్రయించినవారికి నీట్ యూజీ కౌన్సెలింగ్లో అవకాశం ఇస్తామని సుప్రీం కోర్టుకు ప్రభుత్వం తెలిపిన సంగతి తెలిసిందే. జీవో-33ను వ్యతిరేకిస్తూ 135 మంది అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వారికి అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు సైతం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నాన్ పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీవో-33తో ప్రభావితమయ్యే అభ్యర్థులు దాదాపు వెయ్యి మంది వరకు ఉంటారని వైద్య, ఆరోగ్య శాఖ అంచనా వేస్తున్నది. ఇందులో కేవలం 135 మంది మాత్రమే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మిగతా వారు వివిధ కారణాల వల్ల న్యాయస్థానాలను ఆశ్రయించలేకపోయారు.
కొందరు పేదరికంతో, మరికొందరు సమాచారం లేక, ఇంకొందరు మార్గం తెలియక కోర్టును ఆశ్రయించలేదు. ఇప్పుడు వారంతా అయోమయంలో పడ్డారు. కేవలం పిటిషనర్లకే అవకాశం ఇస్తే దాదాపు 850 మంది అన్యాయానికి గురవుతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం బాధితులందరికీ అవకాశమివ్వాలని కోరుతున్నారు. మరికొందరు తమకు కూడా అవకాశం ఇవ్వాలంటూ కోర్టు మెట్లెక్కేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఈ అంశంలో సుప్రీంకోర్టు గత శుక్రవారం తీర్పునిచ్చింది. నాలుగు రోజులు గడుస్తున్నా వైద్య, ఆరోగ్య శాఖ ఇప్పటివరకు ఈ నిర్ణయంపై సమీక్షించలేదు. పిటిషనర్లు, నాన్ పిటిషనర్ల అంశంపై చర్చించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కౌన్సెలింగ్ గడువు దగ్గరికి వస్తున్నా నిర్ణయం తీసుకోకపోవడంపై అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కనీసం ఇప్పటికైనా స్పందించి అందరికీ అవకాశం ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు.