నర్సాపూర్, అక్టోబర్ 16: విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు ఓ ప్రధానోపాధ్యాయుడు, ఇద్దరు ఉపాధ్యాయులకు గురువారం జిల్లా విద్యాధికారి రాధాకిషన్ సస్సెండ్ చేశారు. డీఈవో రాధాకిషన్ తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపూర్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ప్రధానోపాధ్యాయుడు అశోక్, ఉపాధ్యాయులు లక్ష్మణ్, రాచప్పులు విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు గురువారం డీఈవో రాధాకిషన్ సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
నర్సాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బోధిస్తున్న ప్రధానోపాధ్యాయుడు, ఇద్దరు ఉపాధ్యాయులు విధులకు సక్రమంగా హాజరు కావడం లేదని గతంలో విద్యార్ధుల తల్లిదండ్రులు కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ అధికారి, తూప్రాన్ ఎంఈవో సత్యనారాయణతో పాటు చేగుంట ఎంఈవో ఐదు మంది విచారణ సభ్యులు ఈ నెల 9వ తేదిన విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి విచారించడట జరిగింది. ఈ విచారణలో ఉపాధ్యాయులు విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని, విధులకు హాజరైన విద్యార్థులకు పాఠాలు చెప్పడం లేదని తేలింది. కావున ప్రధానోపాధ్యాయుడు, ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ఉపాధ్యాయులు గాని సిబ్బంది గాని విధులకు సక్రమంగా హాజరుకాలేకపోయిన, విధులకు ఆలస్యంగా హాజరైన చర్యలు తప్పవని హెచ్చరించారు.