మియాపూర్ , ఏప్రిల్ 25: నిందితుల నుంచి లంచం తీసుకుంటూ ఓ హెడ్ కానిస్టేబుల్ అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులకు పట్టుబడ్డాడు. హైదరాబాద్ మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న దండె వెంకటరెడ్డి ఇటీవల ఓ గేమింగ్ కేసులో ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. ఆ కేసు నుంచి వారిద్దరినీ తప్పించేందుకు వెంకటరెడ్డి రూ.30 వేలు లంచం డిమాండ్ చేశాడు. సోమవారం వారి నుంచి రూ.10 వేల మొత్తాన్ని తీసుకొన్నాడు. మిగతా రూ.20 వేలను ఎస్ఐ యాదగిరి సూచన మేరకు మంగళవారం స్టేషన్లోనే తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్ఐ యాదగిరి సూచన మేరకే తాను ఈ లంచాన్ని తీసుకున్నట్టు హెడ్ కానిస్టేబుల్ వెంకట్‌రెడ్డి ఏసీబీ అధికారులకు వెల్లడించాడు. ఈ మేరకు వారిద్దరినీ అదుపులోకి తీసుకోవడంతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. ఎస్సై, హెడ్ కానిస్టేబుల్‌ను న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తామని తెలిపారు. గతంలో ఇదే పోలీస్‌స్టేషన్‌లో ఓ ఎస్సై సైతం బాధితుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడటం గమనార్హం.