నల్లగొండ : కష్టకాలంలో ఉన్న రైతన్నలకు అండగా నిలిచిన నాయకుడు సీఎం కేసీఆర్ అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం నార్కట్పల్లి మండలం అమ్మనబోలు, అక్కెనపల్లి, నక్కలపల్లి, షాపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ మేరకు కేసీఆర్ చిత్రపటానికి రైతులు పాలాభిషేకం చేసి పటాకులు కాల్చి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వం మొండికేసినా తెలంగాణ రైతన్న నష్టపోవద్దని సీఎం కేసీఆర్ ప్రతి గింజను కొనుగోలు చేస్తురన్నారు. రైతు నాయకుడు కేసీఆర్ రైతన్నల సంక్షేమం కోసం ఏనాడు కూడా వెనకాడలేదని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం రైతన్నను ఆగం చేసినా ఖర్చును లెక్కచేయకుండా రైతు ప్రయోజనాలే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షాన ఉన్నాడని తెలిపారు.
రాజకీయలబ్ధి కోసమే బీజేపీ నాయకులు తెలంగాణ రైతన్నను ఆగం చేసారని మండిపడ్డారు. పనిపాట లేని ప్రతిపక్షాలు సిగ్గులేకుండా యాత్రలు, దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించలేని దద్దమ్మలు రాష్ట్ర బీజేపీ నాయకులని ఎద్దేవా చేశారు. ఇప్పటికి, ఎప్పటికి రైతన్నను కడుపులో పెట్టుకొని కాపాడుకునేది కేవలం కేసీఆర్ మాత్రమే అని ఆయన స్పష్టం చేసారు.