Krishna Water | కొల్లాపూర్ రూరల్, మే 20 : కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం లక్ష్యం నీరుగారుతున్నది. కాంగ్రెస్ పాలనలో పల్లెలకు మిషన్ భగీరథ నీళ్లు అందడం లేదు. కృష్ణా నది నుంచి ఎత్తిపోసిన నీళ్లు కొల్లాపూర్ సమీపంలోని ఎల్లూరు రిజర్వాయర్‌లో నీటి నిల్వలు ఫుల్‌గా ఉన్నా.. నీటి సరఫరాలో మాత్రం అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ రావడంతోనే కరువుతోపాటు తాగునీటికీ కృత్రిమ కొరత తెచ్చిపెట్టిందని ప్రజలు వాపోతున్నారు.
శ్రీశైలంలో 807.60 అడుగులు
కృష్ణానదిలో నీటి నిల్వలు కనిష్ఠ స్థాయికి చేరింది. ప్రస్తుతం శ్రీశైలంలో నీటిమట్టం 807.60 అడుగుల మేర నిల్వ ఉన్నాయి. శ్రీశైలంలో 800 అడుగుల మేర నీళ్లున్నా నల్లమలలోని రేగుమాన్గడ్డ నుంచి ఓపెన్ కెనాల్ ద్వారా మిషన్ భగీరథకు నీళ్లు అందేలా కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోయినా తాగునీటికి ఇబ్బందులు తలెత్తవద్దని కృష్ణానది నుంచి నీటిని తీసుకునే వెసులుబాటు ఉన్నది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతో నీటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలం అవుతుందన్న ఆరోపణలు ఉన్నాయి.
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందులు ఉన్నాయి. కృష్ణానదికి, మిషన్ భగీరథ ప్రధాన ప్లాంట్‌కు కూతవేటు దూరంలో ఉన్న సోమశిల, నార్లాపూర్, చెంచు పెంటలు, గిరిజన తండాలకు కూడా తాగునీరు అందడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. పెంట్లవెల్లి మండలం యంగంపల్లి తండాలో తాగునీటి కోసం వాటర్ ట్యాకర్ వద్ద పలువురు మహిళలు ఘర్షణ పడగా దాదాపు 10 మందికి గాయాలయ్యాయి. ఇలా నీటి కోసం రోడ్లపైకి వచ్చిన ఆడపడుచులు గొడవ పడుతున్న సంఘటనలు కోకొల్లలు.
4,500 గ్రామాలకు మిషన్ భగీరథ
కొల్లాపూర్ సమీపంలోని ఎల్లూరు రిజర్వాయర్ నీటి ఆధారంగా మిషన్ భగీరథ ద్వారా పలు గ్రామాలకు నీరు సరఫరా అవుతున్నది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు ప్రాంతాలతోపాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు కూడా ఇక్కడి నుంచి శుద్ధజలాలు అందుతున్నాయి. మొత్తం 4,500 గ్రామాలకు భగీరథ నీరు చేరుతున్నది. ఉమ్మడి పాలమూరు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి 13 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు (డబ్ల్యూటీపీ) ఏర్పాటు చేశారు.
740 ఎంఎల్ రా వాటర్ ఈ కేంద్రాలకు సరఫరా అవుతోన్నది. కొల్లాపూర్ నియోజకవర్గమంతా రోజుకు 30 ఎంఎల్ (ఒక ఎంఎల్ పది లక్షల లీటర్ల నీటితో సమానం) సరఫరా జరుగుతున్నది. కొల్లాపూర్, అచ్చంపేట, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి నియోజకవర్గాల పరిధిలో 691 ఆవాసాలకు నీరు చేరుతున్నది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం సగం గ్రామాలకు కూడా తాగునీరు సరఫరా కావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే మిషన్ భగీరథ అధికారులు మాత్రం పూర్తిస్థాయిలో నీటిని అందిస్తున్నామని చెబుతున్నా.. అందులో వాస్తవం లేదని పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.
వంతుల వారీగా బిందెలు
మా ఊరు కృష్ణానదికి.. ఎల్లూరు రిజర్వాయర్ వద్ద ఉన్న మిషన్ భగీరథ ప్లాంట్‌కు కూత వేటు దూరంలో ఉన్నది. గతంలో ఎప్పుడూ నీళ్లు వచ్చేవి. కానీ నేడు తాగునీటి కోసం ప్రజలు తండ్లాడుతున్నారు. నల్లాల వద్ద బిందెలను వంతులు పెట్టుకొని పస్తులు ఉంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే నీటి కష్టాలు మొదలై గోస పడుతున్నాం.
– చిట్టెమ్మ, నార్లాపూర్ మాజీ సర్పంచ్
లీకేజీలతోనే సమస్యలు
కొన్ని గ్రామాల్లో లీకేజీ సమస్యల మూలంగా భగీరథ పథకం ద్వారా తాగునీటిని సక్రమంగా అందించలేకపోతున్నాం. ప్రధానంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు చేపట్టే క్రమంలో చాలా చోట్ల మిషన్ భగీరథ పైపులైన్లు దెబ్బతిన్నాయి. ఆర్అండ్బీ అధికారులకు అలైన్మెంట్ ఇవ్వాలని చాలా సార్లు లేఖలు పంపినా స్పందన లేదు. వారు వివరాలు అందిస్తేనే గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారం అవుతుంది.
– వెంకటేశ్వర్రావు, మిషన్ భగీరథ డీఈ