హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రాయోజిత పథకాల పేర్లను మార్చుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఆ పథకాల్లో భాగంగా రాష్ట్రాలకు అందించే వాటాను మాత్రం పెంచడం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. పథకాల అమలు కోసం కేంద్రం సరిపడా నిధులు ఇవ్వకుండా రాష్ట్రాలపై అదనపు భారం మోపుతున్నదని మండిపడ్డారు. మధ్యాహ్న భోజన వరర్ల వేతనంలో కేంద్ర ప్రభుత్వం తన వాటాను రూపాయి కూడా పెంచకపోవడం బీజేపీ నిర్లక్ష్య ధోరణికి మచ్చుతునకగా అభివర్ణించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం తమ వేతనాలను రూ.3 వేల కు పెంచినందుకు మధ్యాహ్న భోజన వరర్లు శనివారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్లో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గౌర వ వేతనాల పెంపునకు కృషిచేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన పథకం పేరును పీఎం పోషణ్గా మార్చిన కేంద్ర ప్ర భుత్వం వరర్లకు ఇస్తున్న తన వాటాను మాత్రం పెంచలేదని విమర్శించారు. మధ్యా హ్న భోజన వరర్ల గౌరవ వేతనాలను రూ.3 వేలకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం తన వాటాగా కేవలం రూ.600 మాత్రమే చెల్లిస్తున్నదని, మిగతా రూ.2,400 రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నదని వివరించారు. ప్రజలంతా గౌరవప్రదంగా జీవించాలన్నదే బీఆర్ఎస్ ప్రభుత్వ విధానమని, అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా మధ్యాహ్న భోజన వరర్ల వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని తెలిపారు.
మినీ అంగన్వాడీల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు. శనివారం హైదరాబాద్లోని నివాసంలో మినీ అంగన్వాడీ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి నేతృత్వంలోని బృందం కవితకు వినతిపత్రం సమర్పించింది. అనంతరం ‘మినీ అంగన్వాడీ టీచర్ల చైతన్య గీతం’ సీడీని ఆమె ఆవిష్కరించారు. బీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, ప్రధాన కార్యదర్శి నారాయణ, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.