హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ప్రపంచస్థాయి ప్రమాణాలు కలిగి, దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) ప్రతిష్ఠ మసకబారుతున్నది. కొన్నేండ్ల పాటు హెచ్‌సీయూ దేశంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో మొదటిస్థానంలో నిలిచింది. హెచ్‌సీయూలో చదవడం గొప్పగా భావించే రోజుల నుంచి యూనివర్సిటీ పేరు చెప్తేనే ముఖం చాటేసే దుస్థితికి చేరుతున్నది. దేశంలోనే మొదటి ఐదు యూనివర్సిటీల్లో ఒకటిగా ఏండ్ల తరబడి కొనసాగిన హెచ్‌సీయూ క్రమంగా కిందికి దిగజారిపోతున్నది. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ విడుదల చేసిన జాబితాలో హెచ్‌సీయూ 26వ స్థానానికి దిగజారింది. గత ఐదేండ్లుగా అడ్మినిస్ట్రేషన్ వైఫల్యంతో హెచ్‌సీయూపై విశ్వసనీయతను కోల్పేయేలా చేస్తున్నారని విద్యార్థులు చెప్తున్నారు. ఇవే విధానాలు కొనసాగితే భవిష్యత్తు అంధకారమవుతుందని వాపోతున్నారు. ముఖ్యమైన విభాగాల్లోని ఉన్నతాధికారులు ఏండ్ల తరబడి తిష్టవేసి యూనివర్సిటీ స్థాయి దిగజారేలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
గడిచిన ఆరేండ్ల నుంచి హెచ్‌సీయూ ర్యాంకు పాతాళానికి పడిపోతున్నది. 2019లో యూనివర్సిటీ క్యాటగిరీలో దేశంలోనే 4వ స్థానంలో ఉన్న హెచ్‌సీయూ ఆ తరువాత క్రమంగా దిగజారుతూ 2025లో నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్స్ ఫ్రేమ్ వర్క్ విడుదల చేసిన జాబితాలో 18వ స్థానానికి పడిపోయింది. ఓవరాల్ క్యాటగిరీలో నిరుడు 25వ స్థానంలో ఉండగా ఈ విద్యాసంవత్సరానికి ఒక స్థానం దిగువకు చేరి 26వ ర్యాంకుతో సరిపెట్టుకున్నది. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ యూనివర్సిటీ స్థాయి మరింత దిగజారుతున్నది. యూనివర్సిటీలో ప్రొఫెసర్ల నియామకం, మౌలిక వసతుల కల్పన సరిగ్గా లేకపోవడంతో విద్యలో నాణ్యత లోపిస్తున్నది. ముఖ్యంగా చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్‌ను శాశ్వత ప్రాతిపదికన నియమించకపోవడంతో పరీక్షలు, ప్రవేశాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. యూనివర్సిటీలో మౌలిక వసతులు, విద్యలో నాణ్యత లోపించడంతో ప్రతి ఏటా ర్యాంకింగ్ పడిపోతున్నది. పీజీ విద్యార్థులకు ప్లేస్మెంట్లలో కూడా ఢిల్లీలోని జేఎన్‌యూతో పోలిస్తే అత్యల్పంగా నమోదవుతున్నది. ఇలాంటి పరిస్థితుల వల్ల ర్యాంక్ మరింత దిగజారుతున్నది.
యూనివర్సిటీలోని ప్రధాన శాఖల్లో నాన్ టీచింగ్ విభాగానికి చెందిన వారే ఉన్నతాధికారులుగా ఉండటంతో విద్యలో నాణ్యత లోపిస్తున్నది. ఏండ్ల తరబడి శాశ్వత ప్రాతిపదికన ప్రొఫెసర్లను నియమించడంలేదు. నోటిఫికేషన్లు విడుదల చేసి, నామమాత్రంగా నియామక ప్రక్రియ చేపడుతున్నారు. తమకు అనుకూలమైన వారు లేకపోవడంతో ‘నన్ ఫౌండ్ సూటబుల్’ పేరిట ఎంపిక ప్రక్రియను నిలపేస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు కనీస అర్హతలున్నా అనుభవం లేని, తమకు అనుకూలమైన వారిని గెస్ట్ ఫ్యాకల్టీగా నియమించుకుని తరగతులు నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రార్, సీఈవో ఏకపక్ష నిర్ణయాల వల్ల యూనివర్సిటీ ప్రతిష్ఠ మరింత పడిపోతున్నదని విద్యార్థులు, మేధావులు ఆందోళన చెంతున్నారు. ఇప్పటికైనా మంచి విద్య, మౌలిక వసతులు కల్పిస్తూ హెచ్సీయూకు పూర్వవైభవం తీసుకురావాలని కోరుతున్నారు. లేదంటే రానురాను యూనివర్సిటీ ర్యాంకింగ్స్ పాతాళానికి పడిపోయే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.