హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను పరిరక్షించాలని హెచ్సీయూ స్టూడెంట్స్ యూనియన్ నేతలు అకడమిక్ కౌన్సిల్ సమావేశంలో అడ్మినిస్ట్రేషన్ విభాగాన్ని కోరారు. వర్సిటీలోని విధానపరమైన నిర్ణయాలు, కార్యాచరణపై నిర్వహించే అకడమిక్ కౌన్సిల్ సమావేశం శుక్రవారం జరిగింది. 400 ఎకరాల్లో కాంగ్రెస్ సర్కార్ పర్యావరణ, జీవవైవిధ్య విధ్వంసానికి పాల్పడిందని సమావేశంలో విద్యార్థి నేతలు మండిపడ్డారు. ఈ వ్యవహారంపై అడ్మినిస్ట్రేషన్ విభాగం స్పందించాలని డిమాండ్ చేశారు. రేవంత్రెడ్డి సర్కారుపై సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన నేపథ్యంలో ఇప్పటికైనా అడ్మినిస్ట్రేషన్ విభాగం విద్యార్థులకు మద్దతుగా నిలవాలని కోరారు. యూనివర్సీటీ భవిష్యత్తు, పర్యావరణ పరిరక్షణ కోసం తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం 2300 ఎకరాల భూములను వర్సిటీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
యూనివర్సిటీ ఏర్పాటు సమయంలో వర్సిటీకి కేటాయించిన భూముల ఆక్రమణలకు అడ్డుకట్ట వేయడం కోసం అడ్మినిస్ట్రేషన్ విభాగం చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఇందుకు భూముల రిజిస్ట్రేషనే పరిష్కారమని తెలిపారు. క్యాంపస్ నుంచి పోలీసులు, బుల్డోజర్లను వెంటనే వెనక్కి పంపించాలని కోరారు. చెట్లు నరికేసిన ప్రాంతంలో పునరుద్ధరణ చర్యలు చేపట్టేలా ప్రభుత్వానికి సూచించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తమ డిమాండ్లకు అధికారులు సానుకూలంగా స్పందించారని సమావేశం తర్వాత విద్యార్థులు తెలిపారు. కేంద్ర సాధికార కమిటీ నివేదికలో పేర్కొన్నట్టుగానే పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్యం పెంపొందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చినట్టు వెల్లడించారు. పీహెచ్డీ అడ్మిషన్లకు వర్సిటీ పరిధిలోనే ప్రవేశ పరీక్ష నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించినట్టు తెలిపారు. సీఎస్ఐర్కు అప్పగించకుండా దీనిపై అన్ని విభాగాల వారు మరోసారి స్పందించాలని కోరినట్లు తెలిపారు.