హైదరాబాద్ సిటీ బ్యూరో, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): హెచ్‌సీయూ పరిధిలోని 400 ఎకరాల భూమిలో కాంగ్రెస్ సర్కార్ విధ్వంసాన్ని ఆపాలని ఆందోళనలో పాల్గొని జైలుకెళ్లిన విద్యార్థి ఎర్రం నవీన్ విడుదలయ్యారు. శనివారం ఉదయం 7:50 గంటలకు సంగారెడ్డి జిల్లా కంది జైలు నుంచి హెచ్సీయూకు వచ్చారు. వర్సిటీ భూముల పరిరక్షణకు 12 రోజులు జైలు జీవితం గడిపిన నవీన్‌కు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. నార్త్ షాపింగ్ కాంప్లెక్స్ నుంచి మెయిన్ గేట్ దాకా ర్యాలీ కొనసాగింది. కాంగ్రెస్ సర్కారు, సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను పరిరక్షించి, జీవవైవిధ్యం, పర్యావరణాన్ని కాపాడేందుకు పోరాటాన్ని నిరంతరం కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టంచేశారు.
వర్సిటీ భవిష్యత్తుకు వెన్నెముక అయిన భూములను కాపాడేందుకు మళ్లీ మళ్లీ జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. భూములను కాపాడాల్సిన ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తున్నదని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతూ విద్యార్థులను వేధిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌కు ఊపిరితిత్తుల్లాంటి హెచ్‌సీయూ భూముల్లోని చెట్లను నరకొద్దని అడ్డుపడితే అక్రమ కేసులు పెడతారా? అంటూ నిలదీశారు. కాంగ్రెస్ సర్కార్ ఎన్ని కుట్రలు చేసినా ఒక్క గుంట భూమిని కూడా స్వాధీనం చేసుకోనియబోమని తేల్చి చెప్పారు. హెచ్‌సీయూ భూములను కాపాడుకునేందుకు విద్యార్థులంతా ఐక్యంగా పోరాడతామని స్పష్టంచేశారు.
ఆందోళనలో పాల్గొని జైలుకు వెళ్లిన విద్యార్థి రోహిత్ విడుదలకు మరో మూడు, నాలుగు రోజులు పట్టే అవకాశం ఉన్నట్టు విద్యార్థులు చెబుతున్నారు. బెయిల్ కోసం ముగ్గురు లాయర్లు వేర్వేరు పిటిషన్లు వేయడంతో మంజూరు చేయడంలో సాంకేతిక సమస్యలు వచ్చినట్టు వివరించారు. దీంతో బెయిల్ మంజూరుకు ఆలస్యమైందని విద్యార్థులు పేర్కొన్నారు. మరోవైపు రెండో శనివారం, ఆదివారంతోపాటు సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా సెలవు ఉండటంతో బెయిల్ మంగళవారం లేదా బుధవారం వచ్చే అవకాశాలున్నాయని వెల్లడించారు. దీంతో రోహిత్ విడుదలకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పేరులోనే పోరాటతత్వం ఉంది. అది సామాజిక న్యాయం కోసమైనా… భూముల పరిరక్షణ కోసమైనా సరే. కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులకు భయపడేది లేదు.. వర్సిటీ భూముల పరిరక్షణకు పోరాటం ఆపేది లేదు. విద్యార్థులు, అధ్యాపకులు, ప్రజల నుంచి వచ్చిన మద్దతు అద్భుతం. జైలులో ఉన్నప్పటికీ యూనివర్సిటీ భూముల కోసం చేస్తున్న పోరాట సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా ద్వారా తెలుసుకున్నాను. కేసులకు, జైళ్లకు భయపడేది లేదు. భవిష్యత్తులోనూ యూనివర్సిటీ భూముల కోసం పోరాటం ఆగదు.
– ఎర్రం నవీన్, హెచ్‌సీయూ విద్యార్థి