 
                                                            హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): ఎలాంటి షరతులు లేకుండా విద్యార్థులకు సర్టిఫికెట్లు, ఇతర పత్రాలను తిరిగి ఇవ్వాలని పలు కాలేజీలకు రాష్ట్ర మానవ హకుల కమిషన్ (హెచ్ఆర్సీ) ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ హైకోర్టు స్టే విధించింది, పరిపాలన, విద్య వంటి విషయాలు హెచ్ఆర్సీ పరిధిలోకి రావంటూ కాలేజీలు వేసిన పిటిషన్లపై వాదనల తర్వాత హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీచేసింది.
ఫీజు బకాయిలతో సంబంధం లేకుండా విద్యార్థులకు సర్టిఫికెట్లను తిరిగి ఇవ్వాలని హెచ్ఆర్సీ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుల్తాన్ ఉల్ఉలూం ఎడ్యుకేషనల్ సొసైటీ, సెయింట్ పాల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ విడివిడిగా వేసిన పిటిషన్లను చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన డివిజన్ బెంచ్ గురువారం విచారించింది. సర్టిఫికెట్ల జారీ వంటి అంశాలు రాష్ట్ర మానవ హకుల చట్టంలోని సెక్షన్ 2(డీ) పరిధిలోకి రావన్న పిటిషనర్ల వాదనలను ఆమోదించింది. హెచ్ఆర్సీ ఆర్డర్‌పై స్టే ఇచ్చిన హైకోర్టు ప్రతివాదులైన ప్రభుత్వానికి, విద్యార్థులకు నోటీసులిచ్చింది. విచారణను వాయిదా వేసింది.
 
                            