హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): సిర్పూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్పకు హైకోర్టు ఊరట కల్పించింది. ఆయన అరెస్టును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల 12న బీఆర్ఎస్, బీఎస్సీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తడంతో ఇరు పక్షాలు పరస్పరం కేసులు దాఖలు చేసుకున్నాయి.
సయ్యద్ ఫయీం అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కోనేరు కోనప్పతోపాటు అలీంఖాన్, కోనేరు ఫణికుమార్, కోనేరు శ్రీనివాస్ తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీన్ని కొట్టివేయాలని కోరుతూ కోనప్ప దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ కే లక్ష్మణ్ గురువారం విచారణ జరిపారు. పోలీసులతోపాటు ఫిర్యాదుదారుకు నోటీసులు జారీచేసి, కౌంటర్లు దాఖలు చేయాలని స్పష్టం చేశారు. తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకు కోనప్పను అరెస్ట్ చేయరాదని పోలీసులను ఆదేశించిన న్యాయమూర్తి.. తదుపరి విచారణను డిసెంబరు 7కు వాయిదా వేశారు.