హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): మెట్రో రైలు మార్గం నిర్మాణం కోసం హైదరాబాద్ అమీర్‌పేటలో సేకరించిన 735 గజాల స్థలానికి చెల్లించాల్సిన పరిహారాన్ని లెక్కించడంలో ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. ఆ అధికారి నిర్ణయం వివేకవంతమైనదిగానే కనిపిస్తున్నదని, కనుక అందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నది.
ఆ పరిహారం తమకే వస్తుందంటూ వేర్వేరు వ్యక్తులు దాఖలు చేసిన అప్పీళ్లను విచారణకు స్వీకరిస్తున్నట్టు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎన్ తుకారాంజీ ధర్మాసనం ఇటీవల ప్రకటించింది. ఈ వ్యవహారానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న వ్యాజ్యాలపై సివిల్ కోర్టు వెలువరించే తీర్పునకు లోబడి ఒకే వ్యక్తికి పరిహారం చెల్లించాలంటూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపివేసిన ద్విసభ్య ధర్మాసనం.. పరిహారాన్ని వివిధ వాటాదారులకు పంపిణీ చేసే అంశాన్ని సివిల్ కోర్టుకే వదిలివేసింది.