HYDRAA | విచ్చలవిడిగా బుల్డోజర్లతో విరుచుకుపడుతున్న హైడ్రాకు హైకోర్టు బ్రేకులు వేసింది. కనీసం ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా ఇండ్లు కూల్చడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. న్యాయవివాదాల్లో ఉన్న స్థలాల్లోకి వెళ్లి బోర్డులు పాతడంపై కన్నెర్ర జేసింది. కూల్చివేతలు వద్దని కోర్టు పదేపదే చెప్తున్నా, వీకెండ్ కూల్చివేతలు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది.
‘మీరేమైనా సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? మీరు కోర్టుల కన్నా ఎక్కువ అని భావిస్తున్నారా?’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అసలు ఏ మార్గదర్శకాల ప్రకారం కూల్చివేతలు చేపడుతున్నారో చెప్పాలని ఆదేశించింది. అప్పటివరకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూల్చివేతలు చేపట్టవద్దని స్పష్టం చేసింది. అధికారులు, హైడ్రా చర్యల పట్ల ధర్మాసనం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నప్పుడు అధికారులు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించింది.
అధికారులు కండ్లు మూసుకుని ఉంటే ఇలాగే అక్రమ నిర్మాణాలు వెలుస్తాయని, తొలి దశలోనే అడ్డుకొని ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదని చురకలంటించింది. ‘అధికారులు ఇంత కాలం ప్రేక్షకపాత్ర పోషించి, మౌనంగా ఉండిపోయి, ఇప్పుడు మొద్దు నిద్ర నుంచి మేలొని అనధికార నిర్మాణమని చెప్పి కూల్చివేయడం ఏమిటి?’ అని నిలదీసింది.
హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): హైడ్రాకు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఏకపక్షంగా భవనాల కూల్చివేతకు ధర్మాసనం కళ్లెం వేసింది. ఏ విధివిధానాలు అనుసరించి కూల్చుతున్నారో తెలుపాలని ఆదేశాలు జారీచేసింది. జీహెచ్ఎంసీ, మున్సిపల్ చట్టం లేదా ఇతర చట్టాల కింద నిర్వహించే విధులు, నిబంధనల గురించి వివరించాలని ఆదేశించింది. హైడ్రా విధులకు సంబంధించి ప్రామాణిక కార్యాచరణ విధివిధానాలు లేదా గైడ్‌లైన్స్‌ను కోర్టు ముందుంచే వరకు ఏ విధమైన కూల్చివేత చర్యలు కొనసాగించరాదని తేల్చిచెప్పింది. అంతర్గత రహదారులు, ప్రహరీల తొలగింపు, స్థలాలు, భూముల విషయంలో బలవంతపు చర్యలు చేపట్టరాదని స్పష్టంచేసింది. ఈ మేరకు హైకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఐలాపూర్ భూములకు సం బంధించి యథాతథస్థితి ఉత్తర్వులను అమలు చేయాలని ఆదేశించింది.
హైడ్రా అధికారుల బృం దం ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా కూల్చివేత చర్యలకు పాల్పడుతున్నారంటూ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన రైతు ఎంఏ షరీఫ్ హైకోర్టులో అత్యవసర లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎల్ రవిచందర్ వాదనలు వినిపించారు. తెల్లవారుజామున నాలుగున్నర గంటల సమయంలో హైడ్రా అధికారులు, సిబ్బంది, యూనిఫామ్ వేసుకొన్న భద్రతా సిబ్బంది పెద్దసంఖ్యలో వచ్చి కూల్చివేతలు మొదలు పెట్టారని తెలిపారు. వందేండ్లుగా అనువంశికంగా స్వాధీనంలో ఉన్న ఆస్తిలోని ప్రహరీని కూల్చేశారని, నీటి ట్యాంక్‌ను కూడా కూల్చేశారని తెలిపారు. అనేక వాహనాలతో పెద్ద సంఖ్యలో సిబ్బంది, భద్రతా సిబ్బంది వచ్చి యుద్ధ వాతావరణాన్ని తలపించేలా కూల్చివేత చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ ఇమ్రాన్‌ఖాన్ ప్రతివాదనలు వినిపించారు. సర్వే నం.165 నుంచి 175, 212, 213లోని 36.37 ఎకరాల విషయంలో కోర్టు జారీ చేసిన గత ఉత్తర్వులను అడ్డంపెట్టుకొని పిటిషనర్లు వెయ్యి ఎకరాల్లోని భూమిని ఆక్రమించారని తెలిపారు. వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకొనే క్రమంలోనే హైడ్రా అకడికి వెళ్లిందని చెప్పారు. కోర్టు ఉత్తర్వులకు, హైడ్రా కూల్చివేసిన భవనానికి సంబంధం లేదని తెలిపారు. ఎలాంటి అనుమతులు లేని భవనాన్ని కూల్చివేసినట్టు చెప్పారు. విద్యుత్తు కనెక్షన్‌కు కూడా అనుమతి లేదని తెలిపారురు. అకడి నిర్మాణాలు వేటికీ అనుమతులు లేవని చెప్పారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది సమర్పించిన ఫొటోలు, వీడియో క్లిప్పింగ్‌లను పరిశీలించిన న్యాయమూర్తి.. హైడ్రా చర్య దిగ్భ్రాంతికి గురిచేస్తున్నదని వ్యాఖ్యానించారు. వందలాది మంది హైడ్రా సిబ్బంది బ్లూ కలర్ యూనిఫామ్‌లో అకడికి చేరుకోవడాన్ని గమనించారు. పిటిషనర్‌కు చెందిన భవనాన్ని కూల్చివేయడాన్ని కూడా చూశారు. కూల్చివేత చర్యలు చేపట్టే ముందు పిటిషనర్‌కు నోటీస్ ఇవ్వలేదని ఆయన గుర్తించారు. తెలంగాణ హైకోర్టుతోపాటు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులకు విరుద్ధంగా నోటీస్ ఇవ్వకుండా నిర్మాణాన్ని కూల్చడాన్ని తప్పుబట్టారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా నోటీస్ జారీ చేయకుండా భారీ భవనాన్ని కూల్చివేయడంపై విస్మయం వ్యక్తంచేశారు. హైడ్రా చెప్పినట్టుగా అది అనధికారిక నిర్మాణమని భావించినా, అది నిర్మిస్తున్నప్పుడు అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు.
నిర్మాణాలకు అధికారులు ఎలా అనుమతించారో? అర్థం కావడం లేదని పేర్కొన్నారు. అధికారులు కండ్లు మూసుకుని ఉంటే అక్రమ నిర్మాణాలు వెలుస్తాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిర్మాణం తొలి దశలోనే అధికారులు అడ్డుకొని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితులు తలెత్తేవి కావని చెప్పారు. వేరే ఇతర అక్రమ నిర్మాణాలు కూడా జరిగేవి కావని తెలిపారు. ఇంతకాలం అధికారులు ప్రేక్షకపాత్ర పోషించారని, మౌనంగా ఉండిపోయారని, ఇప్పుడు మొద్దునిద్ర నుంచి మేలొని అనధికార నిర్మాణమని చెప్పి కూల్చివేయడం ఏమిటని ప్రశ్నించారు. అక్రమ నిర్మాణమైనా నోటీస్ జారీ చేశాకే కూల్చివేత చర్యలు చేపట్టాలన్న విషయాన్ని ఎందుకు విస్మరించారని హైడ్రాను ప్రశ్నించారు. హైడ్రా ప్రతివాదిగా కనీసం వంద కేసులున్నాయని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఏ ఒక కేసులో కూడా హైడ్రా కూల్చివేతలకు అనుసరించే విధివిధానాలు ఏమిటో? అమలు చేసే ప్రామాణిక విధానం ఏమిటో? ఇప్పటివరకు స్పష్టం చేయలేదని తెలిపారు. అందుకే విధివిధానాలపై వివరణ ఇచ్చే వరకు హైడ్రా కూల్చివేత చర్యలు చేపట్టరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టు స్పష్టంచేశారు. తిరిగి ఆదేశాలను జారీచేసే వరకు యథాతథస్థితి ఉత్తర్వులు అమల్లో ఉంటాయని చెప్పారు. తదుపరి విచారణను వాయిదా వేశారు.
తాము విడుదల చేసే ఉత్తర్వులు చెరువులు, నీటివనరులు, నాలాలు, పారులు, ప్రజా రహదారుల పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టేందుకు అడ్డంకి కాబోవని హైకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది. అవి మినహా ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదని మధ్యంతర ఉత్తర్వుల్లో తేల్చి చెప్పింది. జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 374-బీ కింద హైడ్రాకు ప్రభుత్వం అధికారాలు అప్పగించిందని పేర్కొన్నది. స్థానిక సంస్థల అధీనంలోని భూముల రక్షణకు అధికారాలు అప్పగిస్తూ ప్రభుత్వం జీవోలు జారీ చేసిందని తెలిపింది. అయితే, హైడ్రా చేపట్టే చర్యలకు సరైన ప్రామాణిక విధానంలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. విధివిధానాలు సమర్పించేదాకా నీటి వనరులు, నాలాలు, రోడ్డు తదితరాల రక్షణ చర్యలు తప్ప ఇతర ప్రాంతాల్లోని ఎలాంటి నిర్మాణాల కూల్చివేత చర్యలు చేపట్టరాదని హైడ్రాకు ఆదేశాలు జారీచేసింది.
హైడ్రా విధులకు సంబంధించి ప్రామాణిక కార్యాచరణ, విధివిధానాలు లేదా గైడ్‌లైన్స్‌ను కోర్టు ముందుంచాలి. అప్పటివరకు ఏ విధమైన కూల్చివేత చర్యలు చేపట్టరాదు. అంతర్గత రహదారులు, ప్రహరీల తొలగింపు, స్థలాలు, భూముల విషయంలో బలవంతపు చర్యలు చేపట్టరాదు.
-హైకోర్టు
హైడ్రా చర్యలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. హైడ్రా చెప్పినట్టు అది అక్రమ నిర్మాణమని భావించినా, దానిని నిర్మిస్తున్నప్పుడు అధికారులు ఏం చేస్తున్నారు? నిర్మాణానికి వారు ఎలా అనుమతించారో? అర్థం కావడమే లేదు. అధికారులు కండ్లు మూసుకుని ఉంటే ఇలాగే అక్రమ నిర్మాణాలు వెలుస్తాయి. తొలి దశలోనే అధికారులు అడ్డుకొని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితులు తలెత్తేవి కావు. వేరే ఇతర అక్రమ నిర్మాణాలు కూడా మొదలయ్యేవి కాదు.
-హైకోర్టు
కూల్చివేతలు చేపట్టేముందు పిటిషనర్‌కు నోటీస్ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టుతోపాటు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీటికి విరుద్ధంగా ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే కూల్చివేయడం ఏమిటి? సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అమలు చేయాల్సిందే.
-హైకోర్టు