హైదరాబాద్, మే 7(నమస్తే తెలంగాణ) : మాజీ డీజీపీ బీ శివధర్‌రెడ్డిని రాష్ట్ర భద్రతా సలహాదారుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లో మధ్యంతర స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వం విధానపరంగా పాలనా సౌలభ్యం కోసం తీసుకొన్న నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోబోవని స్పష్టంచేసింది. ప్రకాశ్‌సింగ్ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకంగా శివధర్‌రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా నియమించిందని పేరొంటూ హైదరాబాద్‌కు చెందిన ధన్ గోపాల్‌రావు గతంలో పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యం విచారణలో ఉండగానే ఆయన డీజీపీగా ఉద్యోగ విరమణ చేశారు. అదేరోజు ఆయనను ప్రభుత్వం సలహాదారుగా నియమిస్తూ జీవో జారీ చేసింది.
పాత పిటిషన్లోనే శివధర్‌రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమించడాన్ని సవాలు చేస్తూ పిటిషనర్ తాజాగా మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి గురువారం విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, తుది విచారణ అయ్యే వరకు రాష్ట్ర భద్రతా సలహాదారు నియామక జీవో-1339 అమలును నిలిపివేస్తూ స్టే ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. ప్రభుత్వ నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోబోమని, స్టే ఆదేశాలు జారీ చేయబోమని స్పష్టం చేశారు. తదుపరి విచారణను జూన్ 26కు వాయిదా వేశారు.