ఖైరతాబాద్, జూలై 14: రాజ్యాధికారమే బడుగు బలహీన వర్గాల అంతిమలక్ష్యం కావాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. కవి, రచయిత, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ రచించిన ‘బహు జనగణమన’ పుస్తకం బీసీ వర్గాల ఉద్యమానికి కరదీపికగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ప్రెస్‌క్లబ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన పుస్తకావిష్కరణ సభ తెలంగాణ మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆ పుస్తకాన్ని ముఖ్య అతిథిగా హాజరైన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ.. రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్, తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం వ్యవస్థాపకుడు చిరంజీవులు, కవి, రచయితలు సంగిశెట్టి శ్రీనివాస్, జ్వలిత, ప్రొఫెసర్ తిరుమలి, ప్రెస్‌క్లబ్ ప్రధాన కార్యదర్శి రవికాంత్‌రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఆవిష్కరించారు.
అనంతరం ఏర్పాటైన సభలో బం డారు దత్తాత్రేయ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడుగుల కోసం రూ.వేలాది కోట్లు ఖర్చుపెడుతున్నామని చెబుతుంటాయని, అయినా బీసీలు ఎందుకు వెనుకబడ్డారని ప్రశ్నించారు. సామాజిక న్యాయం కావాల ని, అసమానతలు తొలగిపోవాలని, రాజ్యాధికారమే లక్ష్యమని, బీసీలు ఆత్మగౌరవంతో జీవించే రోజులు రావాలని ఆకాంక్షించారు. దేశంలో అనేక పోరాటాలు జరిగాయని, కానీ అధికారాలు మాత్రం అగ్రకులాలకే దక్కుతున్నాయని చిరంజీవులు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీసీ ఉద్యమం తీవ్రంగా సాగుతున్నదని, ఈ తరుణంలో ఈ పుస్తకం బీసీ భావజాల వ్యాప్తికి దోహదపడుతుందని చెప్పారు. ఈ పుస్తకం గ్రామీణస్థాయి ప్రజల వరకూ చేరాలని ఆకాంక్షించారు. అగ్రవర్ణ నేత ల ఒత్తిడితోనే కులగణన వివరాలను పబ్లిక్ డొమై న్లో పెట్టలేదని, ఆర్డినెన్స్ తీసుకొస్తామంటున్నారని, దానితో ఒరిగేదేమీ ఉండదని రచయిత సంగిశెట్టి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.
నా జన్మధన్యం: జూలూరు
62 ఏండ్లలో అగ్రవర్ణ ఆధిపత్య పెత్తనం ఎలా ఉంటుందో చూశానని, ఆ అనుభవాలను తన పుస్తకంలో పొందుపర్చానని, ఈ పుస్తక రచన ద్వారా తన జన్మ ధన్యమైనట్టు భావిస్తున్నానని పుస్తక రచయిత జూలూరు గౌరీశంకర్ సంతృప్తిని వ్యక్తంచేశారు. తెలంగాణ ఉద్యమా లు, పోరాటాల నేపథ్యం నుంచి ఈ పుస్తకం పుట్టిందని చెప్పారు. ఇప్పటికే ఈ పుస్తకాన్ని తెలుగు రాష్ర్టాల్లో 300 కేంద్రాల్లో ఆవిష్కరించామని తెలిపారు. ఈ ప్రపంచానికే ఒక నాగలినిచ్చి నాగరికతను ఇచ్చిన సందర్భాన్ని ఈ పుస్తకంలో స్పష్టంగా వివరించానని చెప్పారు.