హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): వివక్షకు గురైన ప్రాంతాన్ని సుస్థిరాభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీసుకొంటున్న నిర్ణయాలు సత్ఫలితాలిస్తున్నాయని ప్రముఖ పర్యావరణవేత్త మణికొండ వేదకుమార్ అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా హరిత నిధిని ప్రారంభించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. మంగళవారం ఆయన నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ పచ్చదనాన్ని పెంపొందించే కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేసేందుకు ఈ నిధి ఎంతగానో ఉపకరిస్తుందని చెప్పారు. గ్రామస్థాయిలో హరితహారం ఉద్యమంలా సాగటం వల్లనే ఏడేండ్లలో నాలుగుశాతం గ్రీన్‌కవర్‌ను పెంచుకోగలిగామన్నారు. హరితహారంలాగే వందేండ్లపాటు హరితనిధి కొనసాగేలా మార్గదర్శకాలు ఉండాలని సూచించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌తో దేశవిదేశాలకు తెలంగాణ హరిత కాంక్షను చేరవేసిన ఎంపీ సంతోష్‌కుమార్‌ను ఆయన ప్రశంసించారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు, సంఘాలు ఇలా అందరిని ఒప్పించి పర్యావరణం కోసం ప్రత్యేకంగా నిధి ఏర్పాటు చేయడం గొప్ప విషయమని వేదకుమార్ పేర్కొన్నారు. దేవాలయంలో హుండీలాగే సమాజం కోసం హరితనిధిని ఏర్పాటుచేశారని తెలిపారు. చరిత్రలో ఎప్పుడు, ఎక్కడ మొక్కలు నాటినా 50 శాతం కంటే ఎక్కువ బతికిన దాఖలాలు లేవని, హరితహారంలో నాటిన మొక్కల్లో 85 శాతానికిపైగా బతికాయని తెలిపారు. మొక్కలు నాటడం తెలంగాణ జీవన విధానంలో ఒక భాగమైందని చెప్పారు. ఇప్పుడు ఏ ఊరుకు వెళ్లినా పచ్చని చెట్లు కనబడుతున్నాయంటే దానికి హరితహారమే కారణమని పేర్కొన్నారు. మొక్కలు నాటే కార్యక్రమాలను సుస్థిరంగా కొనసాగించడం వల్ల గ్రామాలకు ఆర్థిక వనరుగా మారి ఉపాధి కల్పన జరుగుతుందని, భవిష్యత్తులో దేశ ఆర్థిక సంపద పెరుగదలకు పరోక్షంగా దోహదం చేస్తుందని చెప్పారు. ఖాళీ ప్రదేశాలను గుర్తించి మొక్కలు నాటడం కొనసాగించాలని సూచించారు.
మొక్కలు నాటడం జీవన విధానమైంది.
చరిత్రలో ఎప్పుడు, ఎక్కడ మొక్కలు నాటినా 50 శాతం కంటే ఎక్కువ బతికిన దాఖలాలు లేవలని, హరితహారంలో నాటిన మొక్కల్లో 85శాతానికిపైగా బతికాయని వేదకుమార్ పేర్కొన్నారు. ఎంతో నిబద్ధత, చిత్తశుద్ధి, నిజాయతీతో పర్యావరణం పరిరక్షణకు చేసిన కృషికి ఇది నిదర్శనమన్నారు. మొక్కలు నాటడం తెలంగాణ జీవన విధానంలో ఒక భాగమైందని, రోడ్లకు ఇరువైపులా, పారిశ్రామిక ప్రాంతాల్లో, యూనివర్సిటీల్లో, అటవీ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా పెద్ద సంఖ్యలో మొక్కలు నాటుతున్నారని తెలిపారు. దీనివల్ల భూమి కోత నివారణ, భూగర్భ జలాల పెంపు, పక్షి, జంతువులకు ఆవాసం, ఆహారం అందించడం సాధ్యమవుతున్నని చెప్పారు. కాలుష్యాన్ని నివారించి, ప్రాణవాయువును అందించడం జీవవైవిధ్యాన్ని కాపాడటంలో హరితహారం ఎంతో ఉపయోగపడుతున్నదని పేర్కొన్నారు.
ఎన్నో చాలెంజ్‌లు ఉంటాయి కానీ గ్రీన్‌చాలెంజ్ లాంటిది మాత్రం ప్రపంచంలో ఎక్కడా చూడలేదని వేదకుమార్ అన్నారు. హరితహారంలో ఒక సీజన్ వరకు మాత్రమే మొక్కలు నాటుతుంటారని, గ్రీన్ చాలెంజ్ మాత్రం 365 రోజులు కొనసాగుతుందని తెలిపారు. మార్చి నెల మండుటెండల్లోనూ గ్రీన్ చాలెంజ్‌లో మొక్కలు నాటడం గొప్ప విషయమన్నారు. సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు ఇందులో పాల్గొంటున్నారని తెలిపారు. మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతిరోజు జరగటం ఒక్క తెలంగాణలోనే సాధ్యమవుతున్నదని అన్నారు. అన్ని రాస్ట్రాలకు ఎంపీ సంతోష్‌కుమార్ మొదలుపెట్టిన చాలెంజ్ మోడల్‌గా మారిందని పేర్కొన్నారు.