హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ) : పర్యావరణ పరిరక్షణకు హరిత నిధి కీలక వేదికగా పనిచేస్తున్నదని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేదర్ సచివాలయంలో మంత్రి సురేఖ అధ్యక్షతన హరిత నిధి 7వ రాష్ట్ర స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గతంలో మంజూరైన ప్రాజెక్టుల అమలు పురోగతిని మంత్రి సమీక్షించగా, పలు కొత్త ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు.
నర్సరీల ఏర్పాటు, అర్బన్ పారుల అభివృద్ధి, అటవీ సంరక్షణ, అటవీ పరిశోధనలు, శిక్షణ, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు, ఎకోటూరిజం తదితర ప్రతిపాదనలకు సమావేశంలో ఆమోదం లభించింది. అనంతరం మంత్రి సురేఖ మాట్లాడారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనులు, మంజూరైన ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారుల సమన్వయంతో హరితనిధి లక్ష్యాలను పూర్తి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.