హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): పచ్చదనం పెంపే లక్ష్యంగా హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. హరితహారం సన్నాహాలు, ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో బీఆర్కే భవన్లో ఆమె సమీక్షించారు. నీటిపారుదల శాఖ భూముల్లో పెద్ద ఎత్తున మొకలు నాటాలని, కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. సాగునీటి, పంచాయతీరాజ్, అటవీశాఖ శాఖల అధికారులతో జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, స్థలాల పరిశీలన, నాటే మొక్కల జాతులను గుర్తించాలని కోరారు. అటవీ భూముల్లో హరితవనాల పురోగతిని కూడా సమీక్షించారు. పీసీసీఎఫ్, హెచ్వోవోఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, డైరెక్టర్ ఎం హన్మంతరావు, స్పెషల్ కమిషనర్ వీఎస్ఎన్వీ ప్రసాద్ ఇతర అధికారులు పాల్గొన్నారు.