Harish rao | హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): పల్లె, పట్టణం తేడా లేకుండా ప్రజలు జ్వరాలతో చస్తుంటే ప్రభుత్వానికి పట్టింపు లేదా? అని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విషజ్వరాలతో ప్రాణాలు కోల్పోయే దుస్థితి దాపురించిందని మండిపడ్డారు. పాలన గాడి తప్పిందని, ఇందుకు మంచంపట్టిన పల్లెలే నిదర్శనమని చెప్పారు. పల్లెల్లో పారిశుధ్యం పడకేసిందని, ఏ ఊరిలో చూసినా ప్రజలు రోగాలతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతి రెండిండ్లతో ఒకరు వైరల్ ఫీవర్‌తో వణికిపోతున్నారని తెలిపారు.
ప్రభుత్వ దవాఖానల్లో మందుల్లేక, డెంగ్యూ కిట్స్ లేక రోగులు ప్రైవేట్ హాస్పిటళ్లకు వెళ్లి అప్పుల పాలవుతున్నారని గురువారం ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తంచేశారు. ‘పడకేసిన పల్లె వైద్యం’, ‘మంచమెకిన మన్యం’, ‘సీజనల్ వ్యాధులతో జనం విలవిల’, ‘ఊరంతా విషజ్వరాలే’ లాంటి వార్తలను సమైక్య పాలనలో చూసేవాళ్లమని, కాంగ్రెస్ పాలన పుణ్యమా అని ప్రస్తుతం ఏ పత్రికలో చూసినా మళ్లీ ఆ వార్తలే ఇప్పుడు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా వంటి విషజ్వరాలు విజృంభిస్తుంటే పాలకులకు చీమకుట్టినట్టయినా లేకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. తప్పుడు లెకలు విడుదల చేస్తూ, విషజ్వరాల కేసులను తకువ చేసి చూపడం వల్ల ప్రయోజనం లేదని, ప్రభుత్వం యుద్ధ ప్రాతిపాదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో విషజ్వరాల బారిన పడే కుటుంబాల సంఖ్య పెరుగుతుందని, గ్రామాలు, తండాలు, హరిజనవాడల్లో తక్షణమే మొబైల్ టీమ్‌ల ద్వారా వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి వైద్యం అందించాలని సీఎం రేవంత్‌రెడ్డిని మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం సీఎంకు బహిరంగ లేఖ రాశారు. ముఖ్యంగా ఆదిలాబాద్, మంచిర్యాల, కొత్తగూడెం, ములుగు, ఆసిఫాబాద్, నిర్మల్, భూపాలపల్లి జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.