కొమురం భీం ఆసిఫాబాద్ : జిల్లాలోని కాకజ్నగర్లో ఎస్టీ బాయ్స్ ఆశ్రమ పాఠశాలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఎమ్మెల్యే కోవా లక్ష్మి, బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కోనప్ప తదితర ప్రజాప్రతినిధులతో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో నేరుగా మాట్లాడి పాఠశాలలో అందుతున్న సౌకర్యాలు, ఎదుర్కొంటున్న సమస్యలను హరీశ్ రావు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు యూనిఫారాలు, సాక్సులు, టై, బెల్టులు, ఐడీ కార్డులు ఇవ్వలేదని విద్యార్థులు తెలిపారు.
పాఠశాలలోని వాటర్ ప్లాంట్ ఆరు నెలలుగా పనిచేయడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటికి సరైన సౌకర్యం లేక స్నానం చేయడానికి ఉపయోగించే నీటినే తాగాల్సిన దుస్థితి ఉందని విద్యార్థులు హరీశ్ రావుకి తెలిపారు. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరిందని, ఎప్పుడు కూలిపోతుందో తెలియక భయంతో గడుపుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు చెప్పిన ప్రతి సమస్యను హరీశ్ రావు స్వయంగా విని, పాఠశాలలోని వసతులు, భవనం, తాగునీటి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు.