హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): ‘మహిళలు ప్రస్తుతం అన్నిరంగాల్లో రాణిస్తున్నారు.. మన దేశ పురోగతికి వారెంతగానో దోహదపడుతున్నారు’ అని బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉప నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హరీశ్‌రావు ఆదివారం ఒక ప్రకటనలో మహిళాలోకానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఐక్యరాజ్యసమితి 2026ని అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరంగా ప్రకటించిందని తెలిపారు. ఇది వ్యవసాయంలో మహిళల దృఢత్వం, నాయకత్వాన్ని గుర్తించడానికి ఒక చారిత్రాత్మక అవకాశం అని ఆయన పేర్కొన్నారు. అనునిత్యం మన కుటుంబాలను, సమాజాన్ని రూపొందించే మహిళల బలం, సంకల్పం, దృఢత్వానికి వందనం అని హరీశ్‌రావు తెలిపారు.