నీటివాటాలపై కేసీఆర్, హరీశ్‌రావు సంతకం పెట్టిండ్రు అంటుండు. మేం సంతకంపెట్టినట్టు చూపుతవా? నేను ముక్కు నేలకు రాస్తా.
-హరీశ్‌రావు
హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): బనకచర్ల లింక్ ప్రాజెక్టుతో తెలంగాణకు ముమ్మాటికీ ముప్పేనని హరీశ్‌రావు పేర్కొన్నారు. ‘గోదావరి బనకచర్ల ప్రతిపాదన 2020-21 ప్రాంతంలో వచ్చింది. మనం నదీ మార్గంగా తీసుకుపోవచ్చని చెప్తే వినలె. నదీమార్గం ద్వారా వెళ్తే తెలంగాణవాళ్లు నాగార్జునసాగర్, శ్రీశైలం దగ్గర నీళ్లు తీసుకుంటరనో..? ఇంజినీర్లు ఏం చెప్పారో.. కానీ జగన్మోహన్రెడ్డి వినలె. తెలంగాణకు సంబంధం లేకుండా ఏపీ భూభాగం నుంచే నీళ్లను మళ్లిస్తామని ప్రతిపాదన తయారుచేశారు. దానిని కేసీఆర్ అప్పుడే తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి షెకావత్‌కు 2023 జూలై 10న లేఖ రాశారు. కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని, గోదావరి-పెన్నా లింక్, అనుమతిలేని ప్రాజెక్టులను నిలువరించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఆదేశాలతో నీటి పారుదల శాఖ మంత్రిని కాకపోయినా నేను, ఎంపీలు ఢిల్లీకి వెళ్లి షెకావత్‌ను కలిసి లేఖ అందజేశాం.
గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ ముందుకుపోకుండా ఆపాలని, అనుమతులు ఇవ్వకూడదని కోరాం’ అని హరీశ్‌రావు తెలిపారు. కానీ, చీకటి ఒప్పందం చేసుకున్నది రేవంత్‌రెడ్డేనని ధ్వజమెత్తారు. ‘రాష్ట్ర ప్రభుత్వం ఇంకా సోయికి రాలె. బనకచర్లతో గోదావరి నీళ్ల మళ్లింపే అనుకుంటున్నం. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టులో కృష్ణా నీళ్ల మళ్లింపు కూడా ఉన్నది. ప్రిలిమినరీ ఫీజుబులిటీ రిపోర్టులో ‘గోదావరి నీళ్లను, తీసుకుపోతం. కృష్ణా నీళ్లను కూడా తీసుకుపోతం’ అని కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు పెట్టింది. అంటే నాగార్జునసాగర్ నీళ్లను తీసుకుపోతారు. నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి 0-80 కిలోమీటర్ల రెండింతలు విస్తరిస్తారు. ఆ 80 కిలోమీటర్లు బొల్లాపల్లి రిజర్వాయర్ కడుతున్నం. సాగర్‌కు వరదలు వచ్చినప్పుడు జలాలను రోజుకు రెండు టీఎంసీలు తీసుకుపోయి బొల్లాపల్లిలో పెట్టుకుంటాం’ అంటూ ఏపీ చెప్తున్నదని వివరించారు.
బనకచర్ల ఒప్పందమేడుందో చూపించు..
కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు మరణశాసనం రాసిందే కాంగ్రెస్ పార్టీ అని హరీశ్‌రావు విమర్శించారు. 299 టీఎంసీలు, 512 టీఎంసీల వాటాల గురించి సీఎం మాట్లాడుతుంటే ఎంతో బాధ కలుగుతున్నదని, అలాంటి వ్యక్తులు తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారా? అని ఆవేదన వ్యక్తంచేశారు. “తెలంగాణకు పట్టిన అబద్ధాల వైరస్ రేవంత్‌రెడ్డి. అబద్ధాలను తట్టుకుని నిలబట్టగలిగేది బీఆర్ఎస్ అనే టీకా. రేవంత్‌రెడ్డి అబద్ధాలను చీల్చిచెండాడుతది. ముద్దాయిగా నిలబడుతది. తెలంగాణ హక్కులను కాపాడేది బీఆర్ఎస్సే. బయటవాళ్లకు సద్దులు కడుతూ తొమ్మిదేండ్లు కేంద్రంతో పోరాడి సెక్షన్-3 సాధించిన ఇంటి మనిషి కేసీఆర్‌పై నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నడు. పేపర్ కటింగ్‌లు, వీడియోలు చూపెడుతూ నానా తంటాలు పడుతున్నడు. కానీ, అందులో ఎక్కడయినా బనకచర్ల ప్రాజెక్టు అనే పదం ఉన్నదా? బనకచర్ల ఒప్పందం ఉన్నదా? అగ్రిమెంట్ ఉన్నదా? నేను మాట్లాడే ప్రతి అంశానికీ లేఖ చూపించా. గోదావరిలో 1,950 టీఎంసీలు అని కేసీఆర్ చెప్పిన దానికి లెక్క చూపించా. అంతేకాదు నీటివాటాలపై కేసీఆర్, హరీశ్‌రావు సంతకం పెట్టిండ్రు అంటుండు. మేం సంతకంపెట్టినట్టు చూపుతవా? నేను ముక్కు నేలకు రాస్తా’ అని సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు సవాల్ విసిరారు.
రాచపుండు పెట్టిందే కాంగ్రెస్
కృష్ణాలో నీటి వాటాలపై శాశ్వత ఒప్పందం చేసుకున్నరంటూ సీఎం రేవంత్‌రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని హరీశ్‌రావు దుయ్యబట్టారు. ‘గోదావరి నదిలో తెలంగాణకు కాంగ్రెస్ 968 టీఎంసీలు కేటాయించిందని, 518 టీఎంసీలు ఆంధ్రకు ఇచ్చిందని చెప్పిండు. కృష్ణాలో కూడా 299 టీఎంసీలు ఇచ్చి తెలంగాణ గొంతు కోసింది కాంగ్రెస్ పార్టీనే. ఈ మరణశాసనం రాసిందే కాంగ్రెస్ పార్టీ. రాచపుండుకు కారణమే కాంగ్రెస్ పార్టీ. ట్రిబ్యునల్-1 అవార్డు ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలను ప్రాజెక్టుల వారీగా కాకుండా గంపగుత్తగా కేటాయించింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేంద్ర జల్‌శక్తి శాఖ 2015 జూన్ 26న సమావేశం నిర్వహించింది. ఉమ్మడి ఏపీకి కేటాయించిన జలాల్లో అప్పటి యుటిలైజేషన్ ప్రకారం 512 టీఎంసీలు ఏపీకి, 299 టీఎంసీలు తెలంగాణకు అని తేల్చారు. అంతేకాదు, జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం గోదావరిలో, కృష్ణాలో నీటి కేటాయింపులపై రిపోర్టు ఇచ్చింది. ఆ రిపోర్టును రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా అసెంబ్లీలో చర్చకు పెట్టారు.
తెలంగాణకు కృష్ణానదిలో 299 టీఎంసీలు ఇచ్చినం. ఏపీకి 512 టీఎంసీలు ఇచ్చినం అని రాసింది, ఆ మరణశాసనం రాసింది కాంగ్రెస్ పార్టీనే. ఈ నీటి కేటాయింపులనే రాష్ట్ర ఏర్పాటు తర్వాత, ట్రిబ్యునల్ కేటాయింపులు పూర్తయ్యేవరకు తాత్కాలిక వర్కింగ్ అరెంజ్మెంట్ కింద 2015-16 నీటి సంవత్సరానికి మాత్రమే వర్తించేలా ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందాన్ని న్యాయస్థానాల్లో కానీ, ట్రిబ్యునల్‌లో కానీ సవాల్ చేయడానికి వీలులేదు. కానీ, రేవంత్‌రెడ్డి గోదావరి వాటాల గురించి చెప్తున్నడు. కృష్ణా వాటాలపై నోరు మెదపవ్! పెదవులు మూసుకుంటున్నవ్! రాచపుండు కాంగ్రెస్ పెట్టింది. ఉమ్మడి ఏపీలో ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వైఫల్యం, చేతగానితనం వల్ల, అడుగులకు మడుగులు ఒత్తడం వల్ల తెలంగాణకు 299 టీఎంసీలు వచ్చాయి’ అని హరీశ్‌రావు దుయ్యబట్టారు. అడ్‌హక్ అగ్రిమెంట్, ఫైనల్ అగ్రిమెంట్‌కు తేడా తెలియని ముఖ్యమంత్రిని ఏం చేయాలని మండిపడ్డారు.
సెక్షన్-3 మా చిత్తశుద్ధికి నిదర్శనం
తెలంగాణ జల హక్కుల కోసం బీఆర్ఎస్, కేసీఆర్ పోరాటానికి సెక్షన్-3ని సాధించడమే నిలువెత్తు నిదర్శనమని హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన 42 రోజుల్లోనే 2014 జూలై 14న కేంద్రానికి కేసీఆర్ లేఖరాశారని గుర్తుచేశారు. ‘ట్రిబ్యునల్-1 ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలను గంపగుత్తగా కేటాయించింది. ఉమ్మడి ఏపీ పాలకులు ఆ జలాలను బేసిన్‌లోని తెలంగాణ ప్రాజెక్టులకు కాకుండా బేసిన్ అవతలి ఏపీ ప్రాజెక్టులకు కేటాయించుకున్నారు. తెలంగాణ పరివాహక ప్రాంతం 69 శాతమైనా నీటి వాటా మాత్రం 298.86 టీఎంసీలు మాత్రమే కేటాయించారు. బేసిన్లో తెలంగాణ డిమాండ్లను, అవసరాలను పట్టించుకోకుండా ఉమ్మడి ఏపీ అన్యాయం చేసింది.
ఆ జలాలు కూడా పేపర్ల మీదనే. వాస్తవంగా అందులో వాడుకునేది సగటున 100 టీఎంసీల కంటే తక్కువే. అందుకే సెక్షన్-3 కింద ట్రిబ్యునల్ వేయాలని, పరివాహక ప్రాంతం ఆధారంగా నీటి కేటాయింపులు చేపట్టాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం 42రోజుల్లోనే కేంద్రానికి లేఖ రాశారు. మా నిజాయితీకి, చిత్తశుద్ధికి ఇది నిదర్శనం’ అని హరీశ్‌రావు వివరించారు. కేసీఆర్ రాసిన లేఖను నాటి కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి ఉమాభారతికి తానే స్వయంగా ఇచ్చానని, ఆ సమావేశంలో అప్పటి కేంద్ర జల్‌శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం కూడా ఉన్నారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు మరణశాసనం రాస్తే, అందుకు పరిష్కారంగా ట్రిబ్యునల్ వేయాలని పోరాడింది బీఆర్ఎస్ పార్టీ అని వివరించారు.
2014 జూలై 14న తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయింపు అన్యాయమని బీఆర్ఎస్ లేఖరాసిందని, కానీ 2015 జూన్ 26 నాటి తాత్కాలిక ఒప్పందాన్నే చూపుతూ రేవంత్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ సెక్షన్-3 కోసం 22 లేఖలు రాసిందని తెలిపారు. ‘2016 అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో కేసీఆర్ చాలా తీవ్రమైన నిరసన వ్యక్తంచేసిండు. రెండున్నరేండ్లు వృథా చేశారని చంద్రబాబు, కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి ముఖం మీదే చెప్పారు. మా నీళ్లు మాకు దక్కకుండా పోతున్నయ్. ఇంకెప్పుడు లెక్కలు తేల్చుతరని నిలదీశారు.. నిలబెట్టి కడిగిండు’ అని వివరించారు. అయినా కేంద్రం అంగీకరించలేదని, దీంతో సుప్రీంకోర్టుకు పోయామని వివరించారు. తుదకు 2వ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో కేసు విత్‌డ్రా చేసుకుంటే ట్రిబ్యునల్ వేస్తామని నాటి కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి షెకావత్ హామీ ఇచ్చారని, ఆ విషయాన్ని అపెక్స్ కౌన్సిల్ మినిట్స్‌లో రాస్తేనే కేసు విత్‌డ్రా చేసుకుంటామని కేసీఆర్ షరతు పెట్టడమేగాక, పట్టుబట్టి మీటింగ్ మినట్స్‌లో రాయించారని తెలిపారు. ఆ తదుపరి కేసు విత్‌డ్రా చేసుకుని, కేంద్రం మీద నిరంతరాయంగా ఒత్తిడి తీసుకువచ్చామని, ఫలితంగా సెక్షన్-3 కింద ట్రిబ్యునల్‌ను వేశారని వివరించారు. ఇప్పుడు కృష్ణాలో 763 టీఎంసీలు కావాలని తెలంగాణ వాదనలు వినిపిస్తున్నదని తెలిపారు. 299 టీఎంసీలకే ఒప్పందం చేసుకుంటే సెక్షన్-3 కోసం సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్తామని ప్రశ్నించారు.
సంతకం పెట్టింది నీ ముద్దుల అడ్వయిజరే..
నీటివాటాలపై సంతకం పెట్టింది కేసీఆర్, హరీశ్‌రావేనని సీఎం రేవంత్‌రెడ్డి పదే పదే చెప్పడంపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘నాటి ఒప్పందంలో సంతకాలు పెట్టింది ఏపీ సర్కారు తరపున అప్పటి ఇరిగేషన్ సెక్రటరీ ఆదిత్యనాథ్‌దాస్, తెలంగాణ తరఫున సెక్రటరీ ఎస్కే జోషి, కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి అమర్జీత్ సింగ్. కానీ రేవంత్ మాత్రం కేసీఆర్, హరీశ్‌రావు సంతకాలు పెట్టిండ్రని అంటున్నడు. చిల్లర రాజకీయాలు ఎందుకు? హుందాగా ఉండు? శాశ్వతంగా ఉన్నదా? ఆ పాపం కూడా కాంగ్రెస్‌దే’ అని నిప్పులు చెరిగారు. “బాబు చెప్పు చేతల్లో ఉన్నవా? ఏపీకి పనిచేస్తున్నవా? తెలంగాణకు పనిచేస్తున్నవా? తెలంగాణకు ద్రోహం తలపెట్టినోడిని అడ్వయిజర్‌గా పెట్టుకుంటరా? గురుదక్షిణ, గురుదక్షిణ అని రేవంత్ మనసు ఇంకా కొట్టుకుంటున్నది.
తెలంగాణ నోరు కొట్టినోడిని, అన్యాయం చేసినోడిని తీసుకొచ్చి అడ్వయిజర్‌గా పెట్టుకున్నడు. కానీ, నీ ముద్దుల అడ్వయిజర్ ఆదిత్యనాథ్‌దాస్ ఆ మీటింగ్‌లో ఏమన్నడో తెలుసా..? ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి తక్షణం తీసుకోవాలని డిమాండ్ చేసిండు’ అని పేర్కొన్నారు. కానీ తెలంగాణ తరఫున ఎస్కే జోషి దానిని వ్యతిరేకించారు. ట్రిబ్యునల్ కేటాయింపులు, నీటి వాటాల లెక్క తేలిన తర్వాతే ప్రాజెక్టులను బోర్డుకు స్వాధీనం చేయాలని తేల్చిచెప్పారని గుర్తుచేశారు. ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో అప్పటి ఇరిగేషన్ శాఖ సెక్రటరీగా ఉన్నదీ ఆదిత్యనాథ్ దాసేనని, 299 టీఎంసీలు, 512 టీఎంసీలు అని తేల్చి అసెంబ్లీకి సమర్పించారనేది వాస్తవమని హరీశ్‌రావు గుర్తుచేశారు. కానీ చంద్రబాబు రికమండేషన్‌తో అతడిని రేవంత్ అడ్వయిజర్‌గా పెట్టుకున్నారని విమర్శించారు.
బర్లు కాసేటోళ్లు, చదువుకున్నవాళ్లకు కూడా అర్ధమైతది. కానీ, రేవంత్‌రెడ్డి మాత్రం 500 టీఎంసీలు చాలని చెప్తున్నడు. ఇట్లా మాట్లాడితే ట్రిబ్యునల్‌లో వాదనలు బలహీనపడుతాయి. ఆ మాత్రం సోయి లేకుండా సీఎం మాట్లాడుతున్నడు. బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యహరించండం, కేసీఆర్ పోరాటం ఫలితంగానే సెక్షన్-3 సాధ్యమైంది. అది బీఆర్ఎస్ విజయం. పోరాట ఫలితం. ఈ ఏడాది అవార్డు వస్తది. శాశ్వతంగా కృష్ణా నదీలో హక్కులు రాబోతున్నాయి. రేవంవరెడ్డి ఇకనైనా చిల్లర రాజకీయాలు బంద్ చేయాలి
-హరీశ్‌రావు
2016లో నిర్వహించిన మొదటి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుతూ “కృష్ణా నదిలో రెండు రాష్ర్టాల్లో ఇప్పిటికే ఉన్న ప్రస్తుత నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదిత ప్రాజెక్టుల కోసం 1000టీఎంసీలకు పైగా నీరు అవసరమవుతుంది. అదే సమయంలో సీడబ్ల్యూసీ వెల్లడించిన లెక్కల ప్రకారమే గోదావరి నదిలో ప్రతీ ఏటా 3000టీఎంసీలకు పైగా నీరు సముద్రంలో వృథాగా వెళ్తుంది. అందువల్ల అందుబాటులో నీటిని, దాన్ని ఎలా సమర్థవంతంగా వినియోగించాలో నిర్ణయించుకోవాలి. రెండు రాష్ర్టాల మధ్య అవగాహన భావనతో సమస్యలను చర్చించి పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది” అని తెలిపారు.