హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హోంగార్డులందరికీ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) రైజింగ్‌డే శుభాకాంక్షలు (Homeguard Raising day) తెలిపారు. ప్రజాభద్రత, విపత్తు నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల నిర్వహణలో హోంగార్డులు (Homeguard) అందిస్తున్న సేవలు అమూల్యమని వెల్లడించారు. హోంగార్డుల సేవలను గుర్తించిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. 2014లో రూ.9000గా ఉన్న వేతనాన్ని, రూ. 27,600కు పెంచింది. ట్రాఫిక్‌లో విధులు నిర్వహించే వారికి 30 శాతం రిస్క్ అలవెన్స్ ఇచ్చింది. మహిళా హోంగార్డులకు ప్రసూతి సెలవులు ఇచ్చి ఆత్మ గౌరవం పెంచింది. కేసీఆర్ ప్రగతి భవన్ వేదికగా హోంగార్డులతో సమావేశమై వేతనాల పెంపుతోపాటు వారి అనేక అపరిస్కృత సమస్యలకు పరిష్కారం చూపారు. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణిస్తే కుటుంబానికి రూ.5లక్షల బీమా అందజేస్తూ, కార్యక్రమాల నిర్వహణకు ఇచ్చే రూ.5 వేలను రూ.10 వేలకు పెంచారు. మొత్తంగా బీఆర్ఎస్ ప్రభుత్వం హోంగార్డుల వేతనాలు, ఇతర భత్యాలకు ఏడాదికి సుమారు రూ.600 కోట్లకుపైగా ఖర్చు చేయడంతో వారి కుటుంబాలు గౌరవంగా బతికాయి. కాంగ్రెస్ సర్కార్ కేవలం బీఆర్ఎస్ ఇచ్చిన రోజువారీ వేతనం రూ.921కి మరో 79 కలిపి మొత్తం రూ.వెయ్యి చేసి ఎంతో చేసినట్టుగా గప్పాలు కొట్టడం నయ వంచనే అవుతుంది.
ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి అవి అమలు చేయకపోగా, తన వికృత చేష్టలతో హోంగార్డులను తీవ్రంగా అవమానిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల మందికి పైగా ఉన్న హోంగార్డులతో ఎన్నో పనులు చేయించుకుంటున్న ప్రభుత్వం, పోలీసుశాఖ.. వారి సంక్షేమాన్ని మాత్రం గాలికొదిలింది. వారి బతుకులను రోడ్డు పాలు చేసింది. రెండేళ్ల కాలంలో 60 మంది పైగా హోంగార్డులు చనిపోయారు. అందులో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారికి తప్ప సహజ మరణం ఏ ఒక్కరికి 5 లక్షలు అందించని దుస్థితి. కారుణ్య నియామకాలు జరపక పోవడం,ఎక్స్ గ్రేషియా అందించకపోవడంతో హోంగార్డుల కుటుంబాలు అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు.
ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తామని, కారుణ్య నియామకాలు ఇస్తామని, హెల్త్‌కార్డులు, వీక్లీ ఆఫ్‌లు ఇప్పిస్తామని,హామీలు ఇచ్చిన రేవంత్ ఒక్కటి కూడా అమలు చేయకుండా, హోంగార్డుల పట్ల కక్ష కట్టారు. కాంగ్రెస్ పాలనలో రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఆర్డర్లీ వ్యవస్థ రద్దు, ఇతర అలవెన్స్‌లు అనేవి రేవంత్ గాలిమాటలుగానే మిగిలిపోయాయి. ఇన్ని సమస్యల మధ్య హోంగార్డులు విధులు నిర్వహిస్తూ.. ప్రజలకు సేవలందిస్తున్నారు. వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
1. జీవో నంబర్ 2 జనవరి 2025లో సహజ మరణం పొందిన హోంగార్డ్స్కు రూ.5 లక్షలు ఇస్తామని పేర్కొన్నారు. 10 నెలలు కావస్తున్న ఇప్పటివరకు ఒక్కరికి కూడా ఆ పరిహారం అందలేదు.
2. హెల్త్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ నెరవేరలేదు. సకాలంలో వైద్యం అందక చాలామంది హోంగార్డులు అనారోగ్యంతో ని మరణిస్తున్నారు.
3. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ మినహాయించి రాష్ట్రంలోని మిగతా జిల్లాల వారికి నాలుగు సంవత్సరాల పెండింగ్ యూనిఫామ్ అలవెన్స్ ఇప్పటి వరకు ఇవ్వలేదు.
4. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హోంగార్డ్ రవీందర్ కుటుంబానికి అండగా ఉంటాము అధికారంలోకి వచ్చిన వెంటనే తక్షణమే కారుణ్య నియామకాలు అమలు జరుపుతామని చెప్పారు. కారుణ్య నియామకాలు కలగానే మిగిలిపోయాయి.
5. అభయ హస్తం మేనిఫెస్టో లో ‘హోంగార్డుల వేతన సవరణతో పాటు, అన్ని సమస్యలు తక్షణమే పరిష్కరిస్తామని ఇచ్చిన హామీ’ నీటి మూటలే అయ్యింది.
6. సకాలంలో జీతాలు అందక, కుటుంబం గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి అద్దె కూడా కట్టలేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా హోం గార్డులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలనీ డిమాండ్ చేశారు.