Harish Rao | ఎన్టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్టును మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. పాలన చేతగాని సర్కారు.. పండగ పూట జర్నలిస్టులపై కక్ష్య సాధింపు చర్యలకు దిగటం సిగ్గుచేటు అని విమర్శించారు. మీ రాజకీయ వికృత క్రీడల్లో తెలంగాణ ఉద్యమకారులైన జర్నలిస్టులను బలి చేస్తారా అని మండిపడ్డారు. ఇళ్లల్లో చొరబడి అర్ధరాత్రి వేళ అరెస్టులు చేయడానికి వాళ్లేమైన తీవ్రవాదులా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జర్నలిస్టుల వరుస అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని హరీశ్‌రావు అన్నారు. ఇది ప్రజాస్వామ్యంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దాడి అని ఆరోపించారు. తెలంగాణ జర్నలిస్టుల ఆత్మగౌరవంపై పని గట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రత్యక్ష దాడి అని అన్నారు. జర్నలిస్టుల అరెస్టులు, మీడియా- డిజిటల్ మీడియాపై సిట్లతో ఎవర్ని కాపాడుతున్నారు? ఎవరిని వేటాడుతున్నారు? అని ప్రశ్నించారు. మీ స్వార్థ రాజకీయాల కోసం ప్రజాస్వామ్య హననానికి పాల్పడటం దుర్మార్గమని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి.. ఇదేనా నీ ప్రజాపాలన? ఇదేనా మీరు చెప్పిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ? అని ప్రశ్నించారు. అరెస్ట్ చేసిన జర్నలిస్టులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్టీవీ ఇన్‌ఫుట్ ఎడిటర్ దొంతు రమేశ్, రిపోర్టుర్లు పరిపూర్ణచారి, సుధీర్లను మంగళవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. కుటుంబంతో విదేశాలకు వెళ్తుండగా దొంతు రమేశ్‌ను హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో అరెస్టు చేయగా.. మరో ఇద్దరు రిపోర్టర్లను సైతం అదుపులోకి తీసుకున్నారు. మహిళా ఐఏఎస్, మంత్రి వార్త వ్యవహారంలో ఎన్టీవీ న్యూస్ ఛానల్‌పై చర్యలకు సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం.. ఈ మేరకు జర్నలిస్టులను అరెస్టు చేశారు. కానీ వారిని అరెస్టు చేసిన విషయాన్ని బయటకు వెల్లడించలేదు. వారిని ఇవాళ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది.