హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : ‘రేవంత్‌రెడ్డీ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులంటే ఎందుకంత కక్ష? రీయంబర్స్మెంట్ చెల్లించకుండా అరిగోస పెడుతున్నారెందుకు? సర్టిఫికెట్లు ఇవ్వకుండా రేపటి తెలంగాణను నిర్దేశించాల్సిన యువతను నేడు రోడ్డుపై నిలబెట్టారెందుకు?’ అంటూ బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ‘మీ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ, విద్యార్థుల భవిష్యత్తు మాత్రం గడప దాటడంలేదు’ అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలను తిట్టడం, అబద్ధాలు చెప్పడం, అసత్యాలు ప్రచారం చేయడంపై ఉన్న శ్రద్ధ.. ఈ రాష్ట్ర బిడ్డలు పడుతున్న గోసను తీర్చడంలో ఎందుకు లేదని నిలదీశారు.
ఇంజినీరింగ్, ఇతర డిగ్రీలు పూర్తిచేసిన పలువురు విద్యార్థులు హరీశ్‌రావును హైదరాబాద్ నివాసంలో ఆదివారం కలిశారు. ‘ప్రభుత్వం ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజీల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడంలేదు. ఉన్నత చదువులకు మేమంతా దూరమవుతున్నాం’ అని బాధిత విద్యార్థులు ఆయన వద్ద కన్నీటిపర్యంతమయ్యారు. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వారు ఈ సందర్భంగా హరీశ్‌రావుకు విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు సానుకూలంగా స్పందించిన ఆయన ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడ్డారు.
రాష్ట్రంలోని ఆశా కార్యకర్తల న్యాయమైన డిమాండ్లను అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి తమకు న్యాయం జరిగేలా చొరవ చూపాలని బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్‌రావుకు తెలంగాణ గ్రామీణ ఆరోగ్య కార్యకర్తల (ఆశా) సంఘం (బీఆర్టీయూ) విజ్ఞప్తి చేసింది. అదివారం ఆయన నివాసంలో సంఘం ప్రతినిధులు అయనను కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఆశా కార్యకర్తలకు జీతాలు పెంచాలని, నెలకు రూ.18,000 స్థిర వేతనం అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్ సంతోష, ఉపాధ్యక్షురాలు లక్ష్మి, ప్రధాన కార్యదర్శి మంజుల, కార్యదర్శి లలిత కోరారు.