సదాశివపేట, ఏప్రిల్ 13 : ‘కరెంటు ఇయ్యరు.. రైతుబంధు వేయరు.. బోనస్ ఇవ్వరు.. పంటను మద్దతు ధరకు కొనరు.. మీ ప్రభుత్వం రైతుల కోసమా? లేక కాంట్రాక్టర్లు, దళారుల కోసమా? అని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు సర్కార్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతుల కష్టాలు గాలికొదిలేసి సీఎం, మంత్రులు గాలి మోటర్లలో విహారాలు చేస్తున్నారని విమర్శించారు. సోమవారం సంగారెడ్డి జిల్లా సదాశివపేట రైతు సేవా కేంద్రంలోని శనగల కొనుగోలు కేంద్రాన్ని సంగారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొనింటి మాణిక్‌రావుతో కలిసి హరీశ్‌రావు సందర్శించారు. కోటా అయిపోయిందంటూ కొనుగోలు నిలిపివేయడంతో వారం రోజులుగా పడిగాపులు కాస్తున్న రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఏటిగడ్డ సంఘం తదితర గ్రామాల రైతులు శనగలు కొనడంలేదని తమ దృష్టికి తీసుకురావడంతో డీసీఎంఎస్ సెంటర్‌ను సందర్శించినట్టు చెప్పారు. రైతులు, నిర్వాహకులను అడిగితే కోటా అయిపోయిందని చెబుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం రైతులకు విత్తనాలు, ఎరువులు ఇవ్వలేక పోతుందని దుయ్యబట్టారు. సకాలంలో రైతుబంధు ఇవ్వకపోగా, కనీసం పండిన పంటను మద్దతు ధరకు కొనే పరిస్థితిలో కూడా లేదని ధ్వజమెత్తారు. గాలి మోటర్లలో తిరుగుతూ కేరళ, ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉంటూ రైతులను విస్మరించారని మండిపడ్డారు.
సదాశివపేటలో కొత్తగా శనగలు కొనకపోగా, ఇప్పటికీ కొన్న శనగలకు బిల్లులు రావడంలేదని, బస్తాలు ఖాళీ చేసి రైతులకే వెనక్కి ఇచ్చేస్తున్నారని హరీశ్‌రావు తెలిపారు. వారం రోజులుగా పడిగాపులు కాస్తున్నామని మొగులయ్య వంటి రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మార్కెటింగ్ శాఖ మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి, ముఖ్యమంత్రి ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 60వేల క్వింటాళ్ల శనగలు రైతుల దగ్గర ఉన్నాయని, వెంటనే క్వింటాల్‌కు రూ. 5,870 మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 11 లక్షల ఎకరాల్లో మక్కజొన్న పండితే సగం కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభం కాలేదని ఆరోపించారు. సంచులు లేవని, టోకెన్లు ఆపేశారని రైతులు చెప్తున్నారని, మద్దతు ధర రూ. 2,400 ఉంటే రూ. 1,600-రూ.1,700లకే అమ్ముకుని రైతులు మోసపోతున్నారని తెలిపారు. ఆరుగాలం కష్టపడ్డ రైతులు పక్క రాష్ర్టాలైన మహారాష్ట్ర, కర్ణాటకకు వెళ్లి సగం ధరకే అమ్ముకునే దుస్థితి ఏర్పడిందని అన్నారు. ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్‌లో ప్రతి పంటకూ బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్.. ఇప్పుడు బోనస్ ఎగ్గొట్టి ఆ మా టను బోగస్ చేసిందని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్లు ఆపి రైతుల కష్టాల మీద సమీక్ష చేయాలని సూచించారు.
భూములు, కాంట్రాక్టర్లు, కమీషన్ల మీదనే రేవంత్‌రెడ్డి రివ్యూలు చేస్తున్నారు తప్ప గరీబ్ రైతుల కోసం సమయం దొరుకదా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. కొనుగోళ్లు ఆగిపోయాయన్న కనీస సమాచారం ఇంటెలిజెన్స్ చెప్పడం లేదా? అని ప్రశ్నించారు. ఇక్కడ మల్లేశం అనే రైతు చెబుతున్నాడు.. రోజుకు కేవలం పది గంటలే కరెంటు ఇస్తున్నారని, పొద్దున ఎనిమిదింటికి కరెంటు వస్తున్నదని రైతులు వాపోతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి జొన్నలు, సన్ ఫ్లవర్, వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.