హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డికి కార్పొరేషన్ పదవులు ఇవ్వడంపై ఉన్న శ్రద్ధ నిధులు విడుదల చేయడంపై లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూ టీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు, విధులు లేకుండా కార్పొరేషన్లను నిర్వీర్యం చేసిన ఘనత రేవంత్‌రెడ్డికే దకుతుందని విమర్శించారు. కార్పొరేషన్లను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చి ఏం సాధిస్తారని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి సంక్షేమం కంటే అనుచరులను సంతృపిపరచడంపైనే ఎక్కువ దృష్టి పెట్టారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం 17 కార్పొరేషన్లకు చైర్పర్సన్లు ప్రకటించడం పట్ల హరీశ్‌రావు బు ధవారం ఒక ప్రకటనలో తీవ్రంగా స్పందించారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 33 కార్పొరేషన్లకు నిధులు కేటాయించడంలో తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు మరికొందరికి కార్పొరేషన్ పదవులు ఇవ్వడం హాస్యాస్పదమని ఆక్షేపించారు. నిధులు విడుదల చేయకపోవడంతో, మొదటి దఫాలో నియమితులైన చైర్మన్లు ప్రజలకు ఒక రూపాయి కూడా సాయం చేయకుండా వారి పదవీకాలాన్ని ముగించారని గుర్తు చేశారు.
33 కార్పొరేషన్లకుగాను 21 కార్పొరేషన్లకు ఒక రూపాయి కూడా ఇవ్వకుండా వాటి అసలు ఉద్దేశాన్ని నీరుగార్చారని మండిపడ్డారు. మాల, మాదిగ, సంతు సేవాలాల్, కుమ్రంభీం, ఏకలవ్య, మైనార్టీ కార్పొరేషన్లకు ఒక రూపాయి కేటాయించకుండా నిర్లక్ష్యం ప్రదర్శించడం, వారి పట్ల చూపుతున్న వివక్షకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముదిరాజ్, యాదవ, మున్నూరు కాపు, కుమ్మరి, విశ్వబ్రాహ్మణ, మేదర, వాల్మీకి, బోయ తదితర కార్పొరేషన్లకు కేటాయించిన నిధుల్లో ఒక రూపాయి కూడా ఖర్చు చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఇలా మొత్తంగా 33 కార్పొరేషన్లకుగాను ఇప్పటివరకు 14,521 కోట్లు కేటాయించగా, విడుదల చేసింది 3,198 కోట్లు మాత్రమే అని, వినియోగించింది రూ.305 కోట్లు మాత్రమే అని వెల్లడించారు. ఇదే విషయాన్ని అసెంబ్లీ లో నిలదీస్తే సరైన సమాధానం లేదని పేర్కొన్నారు. కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించి చేతులు దులుపుకోవడం మానేసి, ఆయా కులాల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.