హైదరాబాద్, అక్టోబరు 15 (నమస్తే తెలంగాణ): హై సెక్యూరిటీ ప్రాంతంగా భావించే గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై లైంగికదాడి ఘటనతో ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైందని మాజీ మంత్రి టీ హరీశ్‌రావు మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ పాలనలో అత్యాచారాలు, హత్యలు నిత్యకృత్యం అయ్యాయని, నేరాల రేటు గణనీయంగా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు రోజురోజుకూ క్షీణిస్తున్నా ప్రభుత్వానికి కనీస పట్టింపు లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి ఒకనాడు శాంతిభద్రతలపై సమీక్షించలేదని విమర్శించారు. మహిళా భద్రతకు చిరునామాగా ఉన్న తెలంగాణలో ఇలాంటి ఘటనలు వరుసగా జరగటం ఆందోళనకరమని విచారం వ్యక్తం చేశారు. బాధితురాలికి భరోసా కల్పించాలని, నిందితులను గుర్తించి కఠిన శిక్ష పడేలా చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. దీనిపై సీఎంవోకు, తెలంగాణ డీజీపీకి ట్యాగ్ చేశారు.