Harish Rao | తెలంగాణలో వైద్య వ్యవస్థ కుప్పకూలిందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. దానికి రాష్ట్రంలో తాజాగా జరిగిన ఈ రెండు అమానవీయ ఘటనలే సజీవ సాక్ష్యాలని తెలిపారు. నిరుపేదల ప్రాణాలంటే ఈ ప్రభుత్వానికి ఎందుకు ఇంత నిర్లక్ష్యం, ఎందుకు ఇంత చులకన భావం అని ప్రశ్నించారు.
తాండూరు రైల్వే స్టేషన్లో అర్ధరాత్రి పురిటి నొప్పులతో ఓ నిరుపేద గర్భిణీ ప్రాణాలతో పోరాడుతుంటే..108కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేదని హరీశ్‌రావు తెలిపారు. చివరికి దిక్కుతోచని పరిస్థితిలో రైల్వే ప్లాట్‌ఫాం పైనే ఆ తల్లి ఆడబిడ్డకు జన్మనివ్వాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఆటో డ్రైవర్ చూపించిన కనీస మానవత్వం, స్పందన కూడా ప్రభుత్వ యంత్రాంగానికి లేకపోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. గర్భిణులకు అండగా ఉండాల్సిన 108 అంబులెన్సులు, అమ్మఒడి వాహనాలు ఎక్కడ? మాయమయ్యాయని నిలదీశారు.
మరోవైపు భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో మరణించిన బంధువు మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఇవ్వాలని వేడుకున్నా ఆసుపత్రి సిబ్బంది కనికరించలేదని హరీశ్‌రావు తెలిపారు. ప్రైవేట్ వాహనం మాట్లాడుకునే స్థోమత లేక.. ఆ నిరుపేద కుటుంబం మృతదేహాన్ని భుజాలపై మోస్తూ వీధుల గుండా నడుచుకుంటూ వెళ్లిన దృశ్యం ప్రతి మనసును కలిచివేస్తోందని అన్నారు. ముగ్గురు రాష్ట్ర మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఇంతటి దారుణం జరగడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలో పేదల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన ఉచిత ‘హర్స్’ వెహికిల్స్ (పరమపద వాహనాలు) ఏమయ్యాయి? ఎందుకు మూలన పడ్డాయని నిలదీశారు.
బతికించేందుకు 108 అంబులెన్సులు రావు.. చనిపోయాక కడసారి ఇంటికి తీసుకెళ్లేందుకు పరమ పద వాహనాలు లేవు.. ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే పాలన అని హరీశ్‌రావు మండిపడ్డారు. మనుషుల ప్రాణాలు అంటే ఈ ప్రభుత్వానికి గౌరవం లేదా? ఆయన వారిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వారికి అండగా ఉండే బాధ్యత లేదా అని ప్రశ్నించారు. యావత్ ప్రభుత్వ యంత్రాంగం, పాలకులు సిగ్గుతో తలదించుకోవాల్సిన అమానవీయ ఘటన ఇది అని విమర్శించారు. ముఖ్యమంత్రి, మంత్రులు ప్రచారాలకే పరిమితం కాకుండా ప్రజల అసలు బాధలను చూడండి అని సూచించారు. భద్రాచలం ఘటనలో అమానవీయంగా వ్యవహరించిన ఆసుపత్రి అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 108 అంబులెన్సులు, పరమపద వాహన సేవలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు.