హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : 24 గంటల కరెంటు విషయంలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు వ్యవహరిస్తున్నదని ఎక్స్‌వేదికగా మండిపడ్డారు. దేశంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంటును అందించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణను కేసీఆర్ తీర్చిదిద్దితే, ఆ ఘనత తమదేనంటూ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు.గతంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంటు దండగ అని, మూడు గంటల కరెంటు సరిపోతుందని రైతు వ్యతిరేక వైఖరిని ప్రకటించిన చరిత్ర రేవంత్‌రెడ్డిది, కాంగ్రెస్ పార్టీదేనని విమర్శించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సాధించిన అభివృద్ధిని చూపించుకునే ముఖం లేక, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ సాధించిన అభివృద్ధిని చూపించి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని, అది కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరికి, మోసపూరిత విధానానికి మరో నిదర్శనమని స్పష్టంచేశారు.