యూరియా కొరతతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు అల్లకల్లోలమవుతుంటే.. అది ప్రతిపక్షాల దుష్ప్రచారమని సర్కారు చెప్పడం సిగ్గుచేటు. కుండపోత వానలో రైతులు గంటల కొద్దీ నిలబడటం అబద్ధమా? ఆధార్ కార్డులు, పాస్ బుకులు, చెప్పులను క్యూలో పెట్టడం అబద్ధమా? అన్నదాతలు అధికారుల కాళ్లు పట్టుకొని వేడుకున్నది అబద్ధమా? దేశానికి అన్నం పెట్టే రైతన్న యూరియా అడిగితే లాఠీలతో కొట్టించింది అబద్ధమా? కాంగ్రెస్ ఎంపీల యూరియా పోరాటం ఫలించిందని చెప్పుకోడానికి ఆ పార్టీకి సిగ్గనిపిస్తలేదా?
– హరీశ్‌రావు
హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ ): రైతు ప్రయోజనాలను పకన బెట్టి, ఎరువుల కొరత విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హైడ్రామాకు తెరతీశాయని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. యూరియా కొరత తీర్చడంపై దృష్టి పెట్టడం మానేసి, తమ తప్పు ఏమీ లేదన్నట్టుగా రెండు పార్టీలు చేతులు దులుపుకోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశ వ్యాప్తంగా 143 లక్షల టన్నుల యూరియా అవసరమైతే, 183 లక్షల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయని, వాటిలో ఇప్పటికే 155 లక్షల మెట్రిక్ టన్నులు విక్రయించినట్టు కేంద్రం ప్రకటించిందని గుర్తుచేశారు. డీఏపీ 45 లక్షల టన్నుల అవసరానికి గాను, 49 లక్షల టన్నులు అందుబాటులో ఉన్నాయని, ఎన్పీకే 58 లక్షల టన్నుల అవసరానికి 97 లక్షల టన్నులు అందుబాటులో ఉన్నాయని కేంద్రం తెలిపినట్టు వివరించారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాలు నిజమైతే, రైతులకు ఎరువులు అందించడంలో విఫలం కావడంపై రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని శనివారం ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.
దేశంలో యూరియా కొరత లేదని ఓవైపు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంటే, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం కేంద్రమే యూరియా ఇవ్వడం లేదంటున్నడు. వీరద్దరిలో ఎవరిది నిజం? ఎవరిది అబద్ధం? ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చెప్పేది నిజమా? లేక, రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేది నిజమా?
– హరీశ్‌రావు