Harish Rao | హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): పోలీసుల కర్కశత్వం వల్ల మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఎడమ భుజానికి తీవ్ర గాయమైంది. సైబరాబాద్ కమిషనరేట్‌లో సాయంత్రం హరీశ్‌రావును అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆయనను కర్కశంగా ఈడ్చిపడేశారు. ఇష్టమొచ్చినట్లు నెట్టేయడంతో ఆయన ఎడమ భుజానికి తీవ్రగాయమైనట్టు తెలిసింది.
పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలోనే గాయం కావడంపట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల్లో కొందరు కావాలనే హరీశ్‌రావును గాయపర్చినట్టు ప్రత్యక్షసాక్షులు చెప్తున్నారు. ఆయన నొప్పిని భరిస్తూ పోలీసుల తీరును నిరసించారు. చేయి నొప్పి పెడుతున్నదని అరిచినా.. కనీసం కనికరం లేకుండా పోలీసులు ఇష్టారీతిన ఈడ్చిపడేయడంతో ఆ నొప్పి మరింత తీవ్రతరమైనట్టు తెలిసింది.
సాయంత్రం 7 గంటల ప్రాంతంలో హరీశ్‌రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆ నొప్పికి ఎలాంటి ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టలేదు. బస్సులో గంటల తరబడి తిప్పుతున్నా హరీశ్‌రావు నొప్పిని భరించారు. ఎక్కడైనా ప్రథమ చికిత్స కోసం ఆపాలని పోలీసులను అడిగినా.. ఎవరూ స్పందించలేదని తోటి బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. దీంతో అలాగే భుజం నొప్పిని భరిస్తూ.. కేశంపేటకు చేరుకున్నారు.
కేశంపేట పోలీస్‌స్టేషన్ లోపలికి తరలించే క్రమంలోనూ మరోసారి పోలీసులు నెట్టివేయడంతో ఆ నొప్పి మరింత తీవ్రమైందని బీఆర్ఎస్ నేతలు చెప్పారు. స్టేషన్ బయట కార్యకర్తలతో మాట్లాడేటప్పుడు కూడా ఆ నొప్పిని మునిపంటితో అదిమిపట్టి దిశానిర్దేశం చేశారు. సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 11.20 వరకు పోలీసుల అదుపులో ఉన్న హరీశ్‌రావు.. తన వాహనంలో వెళ్తూ ప్రథమ చికిత్స తీసుకున్నట్టు తెలిసింది.