హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి హరీశ్‌రావు పోలీస్ అధికారులపై బెదిరించినట్టుగా చేసిన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకొని, క్షమాపణ చెప్పాలని తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు అహోరాత్రులు విధులు నిర్వహిస్తున్నారని ఆ సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి పేర్కొన్నారు. పోలీసుల గురించి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమైనవని, నిరాధారమైనవి తెలిపారు.
ఈ వ్యాఖ్యలు పోలీస్ శాఖ ప్రతిష్ఠను దిగజార్చేలా ఉన్నాయని తెలిపారు. కేసుల దర్యాప్తు సందర్భంలో సాక్ష్యాధారాలను సేకరించడానికి, పునఃసమీక్షించుకోవడానికి, అవసరమైతే ఎవరినైనా, ఎప్పుడైనా విచారణకు పిలిచే అధికారం దర్యాప్తు అధికారికి ఉంటుందని పేర్కొన్నారు. దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో విచారణాధికారులపై నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు.