CM KCR | అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట బీఆర్ఎస్ అభ్యర్థి హరీశ్‌రావుకు గతంలో వచ్చిన రికార్డు మెజారిటీని తిరగరాస్తూ.. భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. సిద్దిపేట ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి పాల్గొన్న సీఎం.. సిద్దిపేటతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘సిద్దిపేటకు రైలు వచ్చిందని.. ఇంకా ఒకటే ఒకటి తక్కువ ఉన్నది అది గాలిమోటర్. మంచినీళ్లు వచ్చినయ్. అధికారం వచ్చింది. గౌరవం వచ్చింది. మెడికల్ కాలేజీ వచ్చింది. ఇరుకోడు వద్ద మినీ యూనివర్సిటీ వస్తుంది. ఇంకా చాలా ఇన్స్టిట్యూషన్లు వస్తున్నయ్. ఇంజినీరింగ్ కాలేజీలు వస్తున్నయ్’ అన్నారు.
‘సిద్దిపేటకు హైదరాబాద్ సమీప ప్రాంతం. కంటోన్మెంట్ దాటితే 70 కిలోమీటర్ల దూరంలో ఉంటది. హరీశ్‌రావు పట్టుబట్టి సిద్దిపేటకు ఐటీహబ్‌ను తీసుకువచ్చిండు. రాబోయే రోజుల్లో ఒక అద్భుత వజ్రం తునకలాగా తెలంగాణ ప్రాంతంలో సిద్దిపేట తయారవుతుందని నేను మీకు హామీ ఇస్తున్నా. చాలా అద్భుతంగా ముందుకుపోతుంది. నాకు డౌట్ లేదు. తెలంగాణ రాష్ట్రంలోనే సిద్దిపేట అంటే ఒక ప్రత్యేకత. ఒక గౌరవం సాధించి పోయిన ఎన్నికల్లో సాధించి చూపెట్టారు. హరీశ్‌రావుకు లక్షపైగా మెజారిటీ ఇచ్చి బ్రహ్మండమైన రికార్డును నెలకొల్పారు. మీ అందరినీ కోరేది ఒకటే. హరీశ్‌రావు పనితనం, మన సిద్దిపేట పటుత్వంగానీ.. మళ్లీ ఆ రికార్డు సిద్ధిపేటకే దక్కాలి. ఈసారి అంతకంటే ఎక్కువ మెజారిటీతో హరీశ్‌రావును గెలిపించాలని మనవి చేస్తున్నా’ అన్నారు.