రంగారెడ్డి, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అయితే లూటీ, లేదంటే లాఠీ రాజ్యం నడుస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ అక్రమాలకు అడ్డుచెప్పిన వారిపై నిర్భంధకాండ ప్రయోగిస్తూ, విచక్షణారహితంగా పోలీసులతో కొట్టిస్తున్నారని మండిపడ్డారు. గురువారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం బోయినగుట్టతండాలో మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, సంత్‌సేవాలాల్ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అనంతరం నిర్వహించిన బహిరంగసభలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నమ్మించి నట్టేట ముంచారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తయినప్పటికీ, ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదని విమర్శించారు. దేవుళ్లనే మోసం చేసిన రేవంత్‌కు ప్రజలను మోసం చేయడం పెద్ద సమస్యేమీ కాదని ఎద్దేవాచేశారు. రైతుభరోసా కింద రూ. తొమ్మిది వేల కోట్లు, యాసంగిలో రూ. నాలుగు వేల కోట్లు ఎగ్గొట్టి, ఆ డబ్బులతో అ రకొరగా రుణమాఫీ చేశారని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో రేవంత్ సర్కార్ పేదల భూములను గుంజుకుంటున్నదని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎవరికీ అవసరంలేని ఫ్యూచర్‌సిటీ కోసం నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు కోసం 1,100 ఎకరాల భూమిని పేద, మధ్యతరగతి ప్రజల నుంచి లాక్కుంటున్నదని మండిపడ్డారు.
ఢిల్లీలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసిందేమీలేదని హరీశ్‌రావు దుయ్యబట్టారు. రాష్ర్టానికి కేసీఆరే శ్రీరామరక్ష అని స్పష్టంచేశారు. గిరిజనుల ఆత్మగౌరవాన్ని పెంచడం కోసం సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించడం, బంజారాహిల్స్‌లో గిరిజనులకు బంజారాభవన్ నిర్మాణం, తం డాలను గ్రామ పంచాయతీలుగా చేయడం, ఎస్టీలకు 10% రిజర్వేషన్లు కేసీఆర్ ఘనతలని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా నాగర్‌కర్నూల్‌లో ఒక మహిళపై ఏడుగురు మానవ మృగాలు లైంగికదాడి చేశారని, హైదరాబాద్‌కు వచ్చిన విదేశీయురాలిపై దుండగులు లైంగికదాడికి తెగబడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్, ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి, గిరిజన నా యకుడు దశరథనాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చరికొండ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు హరీశ్‌రావు సారథ్యంలో బీఆర్ఎస్లో చేరారు.