పాలమూరుకు ఏం చేసినవు? ప్రశ్నించే హక్కు నీకెక్కడిది? కాంగ్రెస్ పాలనలో వలసలు, ఆకలి చావులకు నిలయంగా మారిన పాలమూరు తలరాతను మార్చింది కేసీఆరేనన్న విషయం గుర్తుపెట్టుకో..మీ పాలనలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్ట్‌లుగా మార్చిన ఘనత కేసీఆర్‌దే.. – హరీశ్‌రావు
Harish Rao | హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): రైతు పండుగ పేరిట సీఎం రేవంత్‌రెడ్డి రైతులను మోసం చేశారని, ముఖ్యమంత్రి సహా మంత్రులు ఎంత సొంతడబ్బా కొట్టుకుంటూ మొత్తుకున్నా దండుగే అయ్యిందని, ఆడంబరంగా నిర్వహించిన కార్యక్రమం యావత్ తెలంగాణ రైతాంగాన్ని ఊసూరుమనిపించిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవాచేశారు. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా రైతులందరికీ రుణమాఫీ, రెండు పంటలకు సంబంధించి ఎకరాకు రూ.15 వేల చొప్పున ప్రకటిస్తారనుకుంటే మొండిచెయ్యి చూపారని, ఇక కౌలు రైతులు, ఉపాధి కూలీల రైతుభరోసాకు అతీగతీలేదని శనివారం ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు. కేసీఆర్ ప్రారంభించిన రైతుబీమాను కూడా కాంగ్రెస్ తమ పేటెంట్ అని గప్పాలు కొట్టుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. పాలమూరు సభలో రేవంత్‌రెడ్డి ప్రసం గం వింటే అక్కడి రైతులపై ప్రేమ కంటే గిరిజనుల నుంచి భూముల సేకరణలో ఘోరంగా విఫలమయ్యామనే ఆవేదనే కనిపించిందని దెప్పిపొడిచారు. ‘అభివృద్ధి జరగాలంటే నష్టపోవాలని చెప్తూ రైతులను బెదిరిస్తున్నవు..పాలమూరు బిడ్డగా ఇది నీకు న్యాయమా రేవంత్‌రెడ్డీ?’ అంటూ నిలదీశారు.
‘ఓసారి ఫార్మాసిటీ అని గెజిట్ ఇచ్చి, బీఆర్ఎస్ పోరాటంతో దిగొచ్చి, ఇప్పుడు పారిశ్రామిక కారిడార్ అని ప్రచారం చేయడం, ఎటు వాటమైతే అటు మా ట్లాడడం నీకే చెల్లింది’ అని నిష్ఠూరమాడారు. ఫార్మాసిటీ వద్దంటూ లగచర్లలో లడాయి చేసిన గిరిజనులను జైలుకు పంపి, ఇప్పుడు సొంత జిల్లా ప్రజలపై మొసలి కన్నీళ్లు కార్చడం ఎంతవరకు సబబని నిలదీశారు. రుణమాఫీ చేస్తానని నూటొక్క దేవుళ్లపై ఒట్టుపెట్టి తప్పినట్టే ఇప్పుడు పాలమూరు రైతులకు ఇచ్చిన మాట తప్పవు కదా? అని ప్రశ్నించారు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల కింద 2014లో 27 వేల ఎకరాలు సాగైతే, దాన్ని ఆరున్నర లక్షల ఎకరాలకు పెంచింది కేసీఆరేనని గుర్తుచేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించి 90 శాతం పూర్తి చేస్తే, మిగిలిన పనులు పూర్తిచేయలేక రేవంత్ చోద్యం చూస్తున్నారని దుయ్యబట్టారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే ఆ ఘనతను కూడా కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.
రేవంత్..రాజీనామాకు సిద్ధమా?
‘కేసీఆర్‌కు గజ్వేల్‌లో వెయ్యెకరాల ఫాంహౌ స్ ఉన్నదని రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెప్పడం కాదు దమ్ముంటే నిరూపించాలి, లేదంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి’ అని హరీశ్‌రావు సవాల్ విసిరారు. రేవంత్‌రెడ్డి ఏడాది పాలనలోని అసలు రంగును అసెంబ్లీలో బయటపెడుతామని.. అందుకు రేవంత్‌రెడ్డికి సమయం కేటాయించే దమ్ముందా అని ప్రశ్నించారు. ‘అబద్ధాలతో ఏడాది నడిపించావు, ఇంకెంతోకాలం మోసచేయలేరనే విషయాన్ని గుర్తుపెట్టుకో’ అని హితవు పలికారు.
పాలమూరుకు ఏం చేసినవు? ప్రశ్నించే హక్కు నీకెక్కడిది? కాంగ్రెస్ పాలనలో వలసలు, ఆకలి చావులకు నిలయంగా మారిన పాలమూరు తలరాతను మార్చింది కేసీఆరేనన్న విషయం గుర్తుపెట్టుకో.. మీ పాలనలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్ట్‌లుగా మార్చిన ఘనత కేసీఆర్‌దే.. -హరీశ్‌రావు
నీకు ఇప్పటికే కాంగ్రెస్ తత్వం బోధపడ్డట్టు ఉన్నది.. మళ్లీ అవకాశం వస్తాదా? రాదా? అని భయపడుతున్నట్టున్నవ్.. అసెంబ్లీకి రమ్మని తెగ పిలుస్తున్నవ్.. మేం కూడా అందుకోసమే ఎదురు చూస్తున్నం. ఏడాది పాలనలో నీ అసలు రంగును అసెంబ్లీలో బయటపెట్టేందుకు సిద్ధంగా ఉన్నం. మైక్ కట్ చేయకుండా సమయం కేటాయించే దమ్ముందా..రేవంత్‌రెడ్డీ? -హరీశ్‌రావు