కేసీఆర్ స్టేట్స్ మన్‌గా మాట్లాడితే.. రేవంత్ స్ట్రీట్ రౌడీలా, చీప్‌గా మాట్లాడిండు. ఫ్రస్ట్రేషన్లో రేవంత్ ఏదేదో మాట్లాడుతున్నడు. మంత్రి ఉత్తమ్ ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నడు. కేసీఆర్ లేవనెత్తిన అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నివృత్తి చేయాలి.. లేదంటే సమాధానాలు చెప్పాలి కానీ మరుగుజ్జు, సంకుచిత మనస్తత్వంతో మాట్లాడుతున్నరు.
– హరీశ్
పాలమూరు రంగారెడ్డికి 90 టీఎంసీలను కేటాయిస్తూ కేసీఆర్ ప్రభుత్వం జారీ చేసిన246 జీవోను, 45 టీఎంసీలు చాలంటూ కాంగ్రెస్ సర్కారు రాసిన లేఖను చూపుతున్న హరీశ్

హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ‘90 టీఎంసీలతో ప్రతిపాదించిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 45 టీఎంసీలే చాలని ఎట్లా ఒప్పుకొంటరు? ఆ నీళ్లతో ఎవలను ముంచుతరు? మహబూబ్నగర్నా? నల్లగొండనా? రంగారెడ్డి జిల్లానా? ఇది తెలంగాణ జలహక్కులకు తీరని ద్రోహం’ అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. తక్షణం ఆ ప్రతిపాదనలను ప్రభుత్వం విరమించుకోవాలని, కేంద్రానికి రాసిన లేఖను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే కేసీఆర్ పిలుపుమేరకు ప్రతి తలుపునూ తట్టి ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ మోసాన్ని ఎండగడతామని హెచ్చరించారు. తెలంగాణ భవన్లో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ లేవనెత్తిన అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు చెప్పారు. కేసీఆర్ లేవనెత్తిన అంశాలను నివృత్తి చేయాలని, లేదంటే సమాధానాలు చెప్పాలని, కానీ మరుగుజ్జు మనస్తత్వంతో సీఎం చిట్‌చాట్ పెట్టుకున్నాడని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ది హిమాలయాల ఎత్తు కలిగిన మనస్తత్వమని, రేవంత్‌రెడ్డిది సంకుచిత మనస్తత్వమని మండిపడ్డారు.
కేసీఆర్ స్టేట్స్ మన్‌గా మాట్లాడితే మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని హరీశ్ ఎద్దేవాచేశారు. రెండేండ్లయినా పింఛన్లు పెంచలేదని, రూ.2,500 మహాలక్ష్మీ ఏమైందని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ అడిగారని, నిధుల సేకరణలో అనుభవమున్నదని నాడు పోజులు కొట్టారని, ఇప్పుడేమైందని? నిలదీశారు. వాటాలు, లూటీలు, దోపిడీల్లో మాత్రమే అనుభవం సరిపోయిందా? అని దెప్పిపొడిచారు. రైతులను ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారని, యాప్‌లు, మ్యాపులు ఏందని అడిగితే సమాధానం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక అరాచకత్వం జరిగిందని రేవంత్‌రెడ్డి సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని, ఇటీవల సమ్మిట్‌లో ప్రభుత్వం ఆహ్వానించిన ప్రతినిధులు టోనీ బ్లెయిర్, ఆర్థికవేత్త సుబ్బారావు తెలంగాణ సాధించిన ప్రగతిని చెప్పారని గుర్తుచేశారు.
ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణను దేశంలో నంబర్ వన్‌గా నిలబెట్టిందే కేసీఆర్ అని హరీశ్ కొనియాడారు. 2022-23లో 258 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసి తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచిందని వెల్లడించారు. 2020-21లో 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి బీఆర్ఎస్ రికార్డు నెలకొల్పిందని వివరించారు. కాళేశ్వరంపై అవే పాతచింతకాయ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మల్లన్నసాగర్, రంగనాయక్ సాగర్, అనంతగిరి కింద పండిన పంటలు కాళేశ్వరం నీళ్లతో కాదా? అని నిలదీశారు. నీటి వనరులను మూడు చోట్ల నుంచి తీసుకునేలా కాళేశ్వరం ప్రాజెక్టును రూపొందించారని, వర్షాలు బాగా ఉంటే ఎస్సారెస్పీ నుంచి, మధ్య పరిస్థితులుంటే ఎల్లంపల్లి నుంచి, కరువు పరిస్థితులు వస్తే మేడిగడ్డ నుంచి నీళ్లు వాడుతారని వివరించారు. కాంగ్రెస్ రాకముందే ధాన్యం, డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్ అయ్యిందని వెల్లడించారు.
బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో 48.74 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చిన ఘనత కేసీఆర్‌ది. కానీ నీళ్లు, నీటిపారుదల ప్రాజెక్టులపై అవగాహనలేని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒక్క ఎకరాకు కూడా నీళ్లివ్వలేదని పచ్చి అబద్ధాలు చెప్తున్నడు.. అసెంబ్లీలో ఇచ్చినమంటవు.. ప్రెస్మీట్లో ఇయ్యలేదంటవు.. అసలు నీది నోరా మోరా?
-హరీశ్
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సగంసగం చదవి సగంసగం చెప్తాడని, సాగునీటిశాఖ మంత్రయి రెండేండ్లయినా ప్రిపేర్కాకుండా ప్రెస్మీట్లు పెట్టి పరువు తీసుకుంటున్నాడని హరీశ్ దెప్పిపొడిచారు. పాలమూరు డీపీఆర్ బీఆర్ఎస్ హయాంలో వాపస్ వచ్చిందని పచ్చి అబద్ధాలు మాట్లాడారని నిప్పులు చెరిగారు. పాలమూరు డీపీఆర్ 2023, ఏప్రిల్ 12న వాపస్ వస్తే, మూడు రోజుల్లోనే బీఆర్ఎస్ ప్రభుత్వం జల్‌శక్తి శాఖ మంత్రికి లేఖ రాసిందని, అధికారులతో స్వయంగా కేసీఆర్ మాట్లాడారని, అక్కడి నుంచి డీపీఆర్ పరిశీలనను కొనసాగించేలా సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం)కి ఆదేశాలు ఇప్పించామని వెల్లడించారు.
ఆ తర్వాత కేంద్ర విద్యుత్తు ప్రాధికార సంస్థ (సీఈఏ), సెంట్రల్ సాయిల్, మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్ఎంఆర్ఎస్), కేంద్ర గిరిజన మంత్రిత్వశాఖ, కేంద్ర భూగర్భ జల బోర్డు (సీజీడబ్ల్యూబీ), కేంద్ర పర్యావరణశాఖ నుంచి ఈఏసీ సహా మొత్తం ఏడు రకాల అనుమతులు సాధించామని, డీపీఆర్ వాపస్ వస్తే అనుమతులెలా వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ వచ్చాక మిగిలిన అనుమతులు తీసుకురావాల్సి ఉన్నా సాధించలేదని మండిపడ్డారు. అప్రయిజల్ లిస్ట్ నుంచి పాలమూరు డీపీఆర్‌ను తొలగిస్తున్నామని సీడబ్ల్యూసీ 2024, డిసెంబర్ 19న లేఖ రాస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉన్నదని నిలదీశారు. కేసీఆర్ నిలదీసింది అదేనని వెల్లడించారు. రెండేండ్లలో ఒక అనుమతి కూడా ఎందుకు తేలేదని నిలదీశారు.
బీఆర్ఎస్ మాకు తల్లి.. పార్టీ అధ్యక్షుడు మాకు తండ్రిలాంటి వారు. కానీ రేవంత్ పుట్టుక ఒక పార్టీలో.. సదువు ఒక దాంట్లో, ఉద్యోగం ఒక దాంట్లో.. రేపు ఎందులో ఉంటడో తెల్వది. చొకాలు మార్చినంత సులువుగా పార్టీలు మార్చిన వ్యక్తి రేవంత్‌రెడ్డి. త్యాగాల చరిత్ర మాది.. వెన్నుపోటు చరిత్ర మీది.
-హరీశ్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడితే పాలమూరు బిడ్డను అంటాడని, పాలమూరు పనులను చేపట్టకుండా గొంతుకోయడమే రాజకీయమా? అని హరీశ్ నిలదీశారు. ‘బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టు పనులను 90 శాతం పూర్తి చేసింది వాస్తవం. నార్లాపూర్ పంప్ హౌస్‌లో పంపును రన్ చేసి మహబూబ్‌నగర్ ప్రజానీకానికి ప్రాజెక్టు నీళ్లు వస్తాయన్న భరోసా కల్పించింది కేసీఆర్. నార్లాపూర్ జలాశయాన్ని 95 శాతం పూర్తి చేసి 2 టీఎంసీల నీటిని నింపినం. ఈ రోజుకూ జలాశయంలో 4 టీఎంసీలున్నయ్. ఆ ఘనత మా ప్రభుత్వానిదే. ఏదుల, వట్టెం, కరివెన, ఉద్దండాపూర్ పనులు దాదాపు పూర్తిచేసినం. కేవలం రెండు కిలోమీటర్లు తవ్వితే నీళ్లు నింపుకొనే అవకాశం ఉండేది.
రెండేండ్లలో పనులు పూర్తి చేసి ఉంటే కొడంగల్, నారాయణపేట జిల్లాలకు గ్రావిటీ ద్వారా నారాయణపేట- కొడంగల్ లిఫ్ట్ కన్నా మించి 2 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవి. బీఆర్ఎస్ ఉండి ఉంటే కొడంగల్- నారాయణపేట రైతుల కాళ్లు కృష్ణా నీళ్లతో కడిగే వాళ్లం. మీరు రెండేండ్లలో ఏం చేసిండ్రు? పాలమూరు పనులు 90 శాతం ఎకడయ్యాయంటున్నరు. వస్తరా? పోదామా పాలమూరుకు?’ అని సవాల్ విసిరారు. పాలమూరు బిడ్డనంటూ రేవంత్‌రెడ్డి కన్నతల్లికే ద్రోహం చేస్తున్నారని ధ్వజమెత్తారు.ఉద్దండాపూర్ రిజర్వాయర్, టన్నెల్‌ను ఎందుకు పూర్తి చేస్తలేరని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి రైజింగ్ ఇన్ ఫ్లైయింగ్ అని విమర్శించారు.
సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాడిందే పాటగా పదే పదే 299 టీఎంసీల అంశాన్ని ప్రస్తావిస్తున్నారని హరీశ్ విమర్శించారు. కాంగ్రెస్ అసత్య ప్రచారాలపై అసెంబ్లీలోనే మూతి పలగ్గొట్టే సమాధానమిచ్చానని వెల్లడించారు. 2013లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి ఒక రిపోర్టు ఇచ్చిందని, ఆ రిపోర్టును శాసనసభలోనూ పెట్టారని గుర్తుచేశారు. కృష్ణాలో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలు ఇచ్చినట్టుగా నాటి ఉమ్మడి ప్రభుత్వంలోని కాంగ్రెస్సే ప్రకటించి తెలంగాణకు తీరని చారిత్రక ద్రోహం చేసిందని, మరణ శాసనం రాసిందే కాంగ్రెస్ అని నిప్పులు చెరిగారు.
ఓవైపు పాలమూరు డీపీఆర్‌కు అనుమతులను సాధించకుండా, డీపీఆర్ వెనక్కి వచ్చినా మాట్లాడకుండా మౌనం వహిస్తున్న కాంగ్రెస్ ఇప్పుడు 90 టీఎంసీలతో ప్రతిపాదించిన ప్రాజెక్టుకు 45 టీఎంసీలు చాలని ఢిల్లీకి మంత్రి ఉత్తమ్ కుమార్, సీఎం లేఖ రాశారని హరీశ్ ధ్వజమెత్తారు. కేసీఆర్ నిలదీతతో ఇప్పుడు తాము రాయలేదని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నాడు 90 టీఎంసీలను కేటాయిస్తూ జీవో 246ను కేసీఆర్ ప్రభుత్వం జారీ చేసిందని గుర్తుచేశారు. పాలమూరు నుంచే దిండికి 30 టీఎంసీలు వినియోగించుకోవాల్సి ఉందని తెలిపారు. 45 టీఎంసీలు చాలని లెటర్ రాసి ఇప్పుడు సిగ్గులేకుండా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘చంద్రబాబును చూసి భయపడుతున్నరా? మోదీని చూసి భయపడుతున్నరా? నీటి కేటాయింపులను సగానికి సగం ఎందుకు తగ్గించుకున్నరు? 45 టీఎంసీలే చాలని అడగడం చారిత్రక తప్పిదం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు కేసీఆర్ పూనుకున్నారని గుర్తుచేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన కేవలం 42 రోజుల్లోనే ఢిల్లీకి వెళ్లి సెక్షన్-3 ప్రకారం నదీ పరీవాహక ప్రాంతం ఆధారంగా కృష్ణా జలాలను పునఃపంపిణీ చేయాలని కేంద్రానికి విన్నవించారని, అదీ ఆయన కమిట్మెంట్ అని వివరించారు. 299 టీఎంసీలకు శాశ్వత ఒప్పందం చేసుకుంటే, సెక్షన్-3ని ఎందుకు అడుగుతారని, అపెక్స్ కౌన్సిల్లో ఎందుకు ప్రశ్నిస్తారని, సుప్రీం మెట్లు ఎందుకు ఎక్కుతారని ప్రశ్నించారు. సెక్షన్-3ని సాధించిందే కేసీఆర్ అని వివరించారు. ‘మాట్లాడితే కేసీఆర్ సంతకం పెట్టిండు అంటవు. యాడ పెట్టిండు చూపెట్టు రేవంత్‌రెడ్డీ.
2025, ఫిబ్రవరి 17న కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్లో ఏమున్నది?. అదే తాతాలిక ఒప్పందం వీళ్లు కూడా చేసుకున్నరు. దాని గురించి ఏమంటరు? దానిపై రేవంత్‌రెడ్డి సంతకం పెట్టిండు అని మేం అనలేమా? కానీ మేం చిల్లరగా మాట్లాడం. అందులో ఏముంది ఫైనల్ అవార్డు వచ్చే దాకా 50:50 చేసుకుందామని మీ సెక్రటరీ రాహుల్‌బొజ్జా రాసిండు. అదే డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ 28 లెటర్లు రాసి అడిగింది. మీరు కొత్తగా చేసింది ఏముంది, కొత్తగా రాసింది ఏముంది’ అని ప్రశ్నించారు.
రాజకీయాల కోసం రాష్ట్రం పరువు తీస్తున్నరు. పచ్చ కండ్లద్దాలు పెట్టుకుంటే పచ్చగా కనిపించినట్టు రేవంత్ తీరున్నది. సొంత పార్టీ నాయకులనే తొకుకుంటూ పెరిగిన అని చెప్పిండు. 50 కోట్లు పెట్టి పీసీసీ కొన్నడని కోమటిరెడ్డి చెప్పిండు. ఎమ్మెల్సీని కొనేందుకు 50 లక్షలు లంచమిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన దొంగవు నువ్వు… నువ్వు నిజాయితీ గురించి మాట్లాడటం సిగ్గుచేటు.
-హరీశ్
బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో 48.74 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని హరీశ్ గుర్తుచేశారు. ఒక్క ఎకరాకు కూడా నీళ్లివ్వలేదని మంత్రి ఉత్తమ్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ‘2014 నుంచి 2023 వరకు 17.24 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించింది నిజంకాదా? 31.50 లక్షల ఎకరాలను స్థిరీకరించింది వాస్తవంకాదా?’ అని ప్రశ్నించారు. ప్రిపరేషన్ లేకుండా రావడం.. ప్రగల్భాలు పలకడం..పారిపోవడం మంత్రికి మొదటి నుంచీ అలవాటేనని విరుచుకుపడ్డారు.
‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024-15 బడ్జెట్లో ఆ ఏడాది 6,55,895 ఎకరాలు, 2025-26 బడ్జెట్లో 5,05,000 ఐపీ క్రియేట్ చేస్తమని అసెంబ్లీ సాక్షిగా గొప్పలు చెప్పిండ్రు.. అంటే మొదటి రెండేండ్లలో 11,60,895 ఎకరాలు..కానీ 11 వేల ఎకరాలకైనా నీళ్లిచ్చినవా? ఇస్తే ఎక్కడిచ్చినవో చెప్పు..లేకుంటే అసెంబ్లీ సాక్షిగా తప్పులు చెప్పానని ముక్కునేలకు రాసి క్షమాపణలు చెప్పు’అని సవాల్ విసిరారు. ‘ఉత్తమ్‌కుమార్‌రెడ్డీ.. నువ్వు చెప్పేదే నిజమైతే దమ్ముంటే నా సవాల్‌ను స్వీకరించాలి’ అని డిమాండ్ చేశారు. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క ప్రాజెక్టు కట్టింది లేదని, ఒక్క చెక్‌డ్యామ్ పూర్తిచేసింది లేదని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ హయాంలో డ్యామ్‌ల పేల్చివేత, ప్రాజెక్టుల కూల్చివేత తప్ప చేసిందేమున్నదని నిలదీశారు. తెలంగాణ ఆర్థిక ప్రగతిని పట్టాలెక్కించిన కేసీఆర్‌ను ఉద్దేశించి ఆర్థిక ఉగ్రవాది అనడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రాజెక్టులు, చెక్‌డ్యామ్‌లను కూల్చివేస్తున్న అసలైన ఉగ్రవాది రేవంత్ రెడ్డేనని నిప్పులు చెరిగారు. కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి చిల్లర చేష్టలు, పిచ్చి పనులకు పరాకాష్ట అని అభివర్ణించారు.
నాటి నుంచి నేటి వరకు కృష్ణా నీళ్లను ఆంధ్రాకు తాకట్టుపెట్టి తెలంగాణకు మరణశాసనం రాసింది కాంగ్రెస్ పార్టీయేనని హరీశ్ తేల్చిచెప్పారు. కృష్ణాపై ప్రాజెక్టులు కట్టకుండా పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల రైతాంగాన్ని నిట్టనిలువునా ముంచిందని నిప్పులు చెరిగారు. ‘ఎస్ఎల్బీసీ కుప్పకూలి మరణించిన కూలీల శవాలను కూడా వెలికితీయని చేతగాని ప్రభుత్వం రేవంత్‌రెడ్డిది..కృష్ణా నీళ్లలో అతితక్కువ నీటి వినియోగం (28.49 శాతం) జరిగింది నీ పాలనలోనే’ అంటూ తూర్పారబట్టారు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను పూర్తిచేయకుండా నిర్లక్ష్యం చేసిన పాపం కాంగ్రెస్‌దేనని ధ్వజమెత్తారు.
కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాలపై సీఎం రేవంత్‌రెడ్డి..మంత్రులు పూటకో మాట మాట్లాడుతూ తెలంగాణకు తీరని ద్రోహం చేస్తున్నారని హరీశ్ మండిపడ్డారు. ‘2025, జూన్ 18న రేవంత్‌రెడ్డి ఏమన్నడు.. కృష్ణా బేసిన్ మీద 500 టీఎంసీలకు బ్లాంకెట్ ఎన్వోసీ ఇవ్వండి..ఆ తర్వాత ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకోండి.. ఎన్ని టీఎంసీలైనా తీసుకుపోండి అన్నడు.. సెప్టెంబర్ 13న నీటిపారుదల శాఖపై సమీక్షలో కృష్ణా జలాల్లో 904 టీఎంసీల వాటా సాధించి తీరాలె అంటడు..ఇక నీళ్ల మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డేమో 763 టీఎంసీల రైట్ షేర్ అంటడు.. అసలు వీరి మాటల్లో ఎవరిది కరెక్టు? వారివి నోర్లా? మోర్లా?’ అని ధ్వజమెత్తారు. రాష్ర్టానికి హక్కుగా రావాల్సిన నీటి వాటాను కాంగ్రెస్సోళ్ల అజ్ఞానంతో కోల్పో యే పరిస్థితి ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ఏపీ సీఎం చంద్రబాబు డైరెక్షన్లో తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు తాకట్టుపెడుతున్న అసలైన జల ద్రోహి రేవంత్‌రెడ్డేనని విరుచుకుపడ్డారు.
రేవంత్‌రెడ్డిది ఎంత మరుగుజ్జు మనస్తత్వమంటే.. నిన్న కేసీఆర్ 7 గంటలకు ప్రెస్‌మీట్ పెడితే.. రేవంత్‌రెడ్డి 9గంటలకు ఇంట్ల చిట్‌చాట్ పెట్టుకున్నడంటెనే ఎంత సంకుచిత.. ఎంత మరుగుజ్జు మనస్తత్వంతో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నడో మనకు అర్థమవుతున్నది. అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నం. కేసీఆర్‌ది హిమాలయాల ఎత్తు కలిగిన మనస్తత్వం. రేవంత్‌రెడ్డిది మరుగుజ్జు మనస్తత్వం.
-హరీశ్
రేవంత్‌రెడ్డి ఆంధ్రా బాబు అడుగులకు మడుగులొత్తుతూ పాలమూరు నీటి హక్కులను కాలరాస్తున్నాడని హరీశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. నాగార్జునసాగర్ కుడి కాల్వ నుంచి ఏపీ ప్రభుత్వం రోజూ 10 వేల క్యూసెక్కుల నీటిని తరలించుకుపోతుంటే చేష్టలుడిగి చూస్తున్నాడని మండిపడ్డారు. ఏపీకి ఈ నీటి సంవత్సరంలో 667 టీఎంసీలు కేటాయిస్తే ఆరు నెలలు మిగిలి ఉండగానే 657 టీఎంసీలు తరలించుకుపోయిందని చెప్పారు. అడ్డుకోవాల్సిన రేవంత్ సర్కారు చంద్రబాబుకు దాసోహమై తెలంగాణకు తీరని ద్రోహం చేస్తున్నదని నిప్పులు చెరిగారు. తెలంగాణ నీటి ప్రయోజనాలు పట్టని కాంగ్రెస్ తీరుతో మన రైతులకు తీవ్ర నష్టం జరుగతున్నదని చెప్పారు.
‘కాంగ్రెస్ పాలకులు 1984లో కల్వకుర్తికి కొబ్బరికాయకొట్టి 2014 వరకు 13 వేల ఎకరాలకు నీళ్లిచ్చారు..కానీ కేసీఆర్ పదేండ్లలో కల్వకుర్తికి రూ. 2,600 కోట్లు ఖర్చుచేసి 3.7 లక్షల ఎకరాలు..నెట్టెంపాడు ద్వారా కాంగ్రెస్ 2,300 ఎకరాలకు నీరందిస్తే.. మేం రూ.540 కోట్లు ఖర్చుచేసి 40 వేల ఎకరాలను తడిపినం.. భీమా కింద కాంగ్రెస్ 12 వేల ఎకరాలకు నీరిస్తే.. మేం రూ.646 కోట్లు వెచ్చించి 1.60 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చినం.. కోయిల్‌సాగర్ ద్వారా 38 వేల ఎకరాలు.. ఈ నాలుగు ప్రాజెక్టుల కింద 6.5 లక్షలు.. మొత్తంగా 10 లక్షల ఎకరాలకు నీరందించినం’ అంటూ గణాంకాలతో సోదాహరణంగా వివరించారు.
ఎస్ఎల్బీసీ కుప్పకూలి చనిపోయిన కూలీల శవాలను కూడా వెలికితీయని చేతగాని ప్రభుత్వం రేవంత్‌రెడ్డిది. కృష్ణా నీళ్లలో అతితక్కువ నీటి వినియోగం (28. 49 శాతం) నీ పాలనలోనే జరిగింది. నల్లమల బిడ్డనని గొప్పగా చెప్పుకొనే రేవంత్‌రెడ్డికి నల్లమల ఏ బేసిన్లో ఉన్నదో కూడా తెల్వది.
-హరీశ్
రెండేండ్లలో పావు కిలోమీటర్ కూడా సొరంగం తవ్వని కాంగ్రెస్ నేతలు పచ్చి అబద్ధాలు చెప్తూ ప్రజలను పక్కదోవపట్టిస్తున్నారని హరీశ్ మండిపడ్డారు. కేసీఆర్ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత గందరగోళంగా ఉన్న మొదటి ఏడాది, కరోనా కారణంగా రెండు సంవత్సరాలు మినహాయించి ఏడేండ్లలో రూ.1,358 కోట్లు ఖర్చు చేసి 11.48 కిలోమీటర్ల టన్నెల్ తవ్వకాన్ని పూర్తిచేశారని పేర్కొన్నారు. ఎస్సెల్బీసీలో భాగమైన డిండి, పెండ్లిపాక రిజర్వాయర్ల కోసం భూ సేకరణ, పునరావాసం కోసం రూ.3,892 కోట్లు ఖర్చు చేశామని గుర్తుచేశారు. కానీ రేవంత్‌రెడ్డి రెండేండ్లలో పావు కిలోమీటర్ తవ్వకుండానే ఎనిమిది మంది కూలీల ప్రాణాలను బలితీసుకున్నారని ధ్వజమెత్తారు. ‘ప్రాజెక్టు పనులు పూర్తి చేయడం దేవుడెరుగు, కనీసం సొరంగంలో పూడుకుపోయిన మృతదేహాలను బయటకు తీయలేని దద్దమ్మ ప్రభుత్వం రేవంత్‌రెడ్డిది’ అని ఎద్దేవా చేశారు. ‘శవాలను వెలికితీసే పనులను పర్యవేక్షించాల్సిన మంత్రి చేపల పులుసు తిని వచ్చారు తప్ప సాధించిందేం లేదు’ అని దెప్పిపొడిచారు.
ప్రాజెక్టుల నిర్మాణంలో నిర్లక్ష్యం..కృష్ణా జలాల్లో నీటి వాటా సాధనలో విఫలమైన కాంగ్రెస్‌ను కేసీఆర్ ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టబోరని హరీశ్ హెచ్చరించారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఆయన చూస్తూ ఊరుకోబోరని తేల్చిచెప్పారు. గతంలో ప్రాజెక్టులపై ఆధిపత్యాన్ని కేంద్రానికి అప్పగించాలని నిర్ణయించిన కాంగ్రెస్ సర్కారుపై గర్జించారని గుర్తుచేశారు. కేసీఆర్ ఒత్తిడితోనే కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చిందని స్పష్టంచేశారు. ఇప్పుడు తెలంగాణ నీటి హక్కులను చంద్రబాబుకు ధారాదత్తం చేస్తున్న రేవంత్ సర్కారును వదిలిపెట్టబోరని కుండబద్దలు కొట్టారు. పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డిలో బహిరంగ సభలు పెట్టి కాంగ్రెస్ అక్రమ వ్యవహారాలను బట్టబయలు చేస్తారని ప్రకటించారు. ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి సోయి తెచ్చుకొని 45 టీఎంసీలు చాలని రాసిన లేఖను వెనక్కి తీసుకోవాలని, చేసిన తప్పునకు లెంపలేసుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎట్టిపరిస్థితుల్లో 90 టీఎంసీలు కేటాయించేదాకా పట్టువదలవద్దని తేల్చిచెప్పారు. లేదంటే తెలంగాణ రైతాంగం తగిన బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నదని హెచ్చరించారు.
రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క ప్రాజెక్టు కట్టింది లేదు.. ఒక్క చెక్‌డ్యామ్ పూర్తిచేసింది లేదు. డ్యామ్‌ల పేల్చివేత, ప్రాజెక్టుల కూల్చివేత తప్ప రెండేండ్లలో చేసిందేమున్నది? తెలంగాణ ఆర్థిక ప్రగతిని పట్టాలెక్కించిన కేసీఆర్‌ను ఉద్దేశించి ఆర్థిక ఉగ్రవాది అనడం దుర్మార్గం. ప్రాజెక్టులు, చెక్‌డ్యామ్‌లను కూల్చివేస్తున్న అసలైన ఉగ్రవాది రేవంత్‌రెడ్డే.
-హరీశ్