హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో విద్యావ్యవస్థ ధ్వంసమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలు పరిషరించడంలో సీఎం విఫలం అయ్యారని దుయ్యబట్టారు. విద్యాశాఖను తన వద్దే ఉంచుకొన్న సీఎం.. విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే గురుకుల విద్యార్థులు ఆందోళనలు చేస్తుండగా, బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు సైతం ఆందోళనబాట పట్టారని పేర్కొన్నారు. 17 డిమాండ్లతో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు నాలుగు రోజులుగా నిరసన తెలియజేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ట్రాక్టర్లో వెళ్లి, కళాశాల గోడ దూకి నానా యాగీ చేసిన రేవంత్‌రెడ్డి.. అధికారంలోకి వచ్చిన తరువాత విద్యార్థుల భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేశారని హరీశ్‌రావు దుయ్యబట్టారు.
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించింది బీఆర్ఎస్ సర్కారేనని హరీశ్‌రావు చెప్పారు. నాడు మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ట్రిపుల్ ఐటీకి వెళ్లి విద్యార్థుల సమస్యలను పరిష్కరించారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన కృషిని కొనసాగించకుండా సీఎం రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యం చేశారని, ఫలితంగా సమస్యలు పేరుకుపోయాయని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో నాలుగు ట్రిపుల్ ఐటీలు ఏర్పాటు చేస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి.. కొత్త వాటి ఊసు ఎత్తకపోగా ఉన్నవాటికి సౌకర్యాలు కల్పించడంలో విఫలం అయ్యారని ఎద్దేవా చేశారు.
రేవంత్‌రెడ్డి పాలనలో ప్రాథమిక స్థాయి నుంచి ట్రిపుల్ ఐటీ వరకు సకల విద్యాలయాలు ధ్వంసమయ్యాయని, ధ్వంసం కాని విద్యాలయాలు ఇంకా ఏవైనా ఉన్నాయా? అని మండిపడ్డారు. ఇప్పటికే టీచర్లు లేక 1,800 పాఠశాలలు మూతపడ్డాయని, కల్తీ ఆహారంతో ఫుడ్ పాయిజన్ కేసులు పెరిగిపోయాయని, 600 మంది విద్యార్థులు దవాఖానల పాలు కాగా, 40 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. ఇప్పటికైనా బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలు పరిషరించడంతోపాటు విద్యాశాఖలో నెలకొన్న సమస్యల పరిషారం కోసం వెంటనే రాష్ట్ర స్థాయి సమీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు.