హైదరాబాద్, జూన్ 27 (నమస్తేతెలంగాణ): కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో తెలంగాణలోని ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆందోళన వ్యక్తంచేశారు. ‘ఖమ్మం పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోవడం, పాలమూరులోని వట్టెం పంప్‌హౌస్ మునిగిపోవడం, నల్లగొండలో సుంకిశాల, ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలడం, గద్వాలలోని జూరాల ప్రాజెక్టు రోప్ తెగిపోవడం, సంగారెడ్డి జిల్లాలోని మంజీరా డ్యాం ఆఫ్రాన్ కొట్టుకుపోయి పిల్లర్లకు పగుళ్లు రావడం వంటివి రేవంత్ ప్రభుత్వ చేతగానితనానికి నిలువుటద్దాలు’ అని దుయ్యబట్టారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో సుభిక్షంగా ఉన్న సాగునీటి రంగం ఏడాదిన్నర రేవంత్ పాలనలో సంక్షోభంలో కూరుకుపోయిందని శుక్రవారం ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తంచేశారు.
కొత్త ప్రాజెక్టులు కట్టకపోయినా ఉన్న రిజర్వాయర్లను గాలికొదిలేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక కొత్త ప్రాజెక్టు అయినా కట్టారా? ఒక ఎకరానికైనా కొత్తగా నీళ్లిచ్చారా? ఒక్క చెక్ డ్యాంనైనా నిర్మించారా? కనీసం కాలువనైనా తవ్వారా? అని ప్రశ్నించారు. ‘రేవంత్‌రెడ్డీ.. ఇప్పటికైనా కండ్లు తెరిచి మేడిగడ్డపై దుష్ప్రచారాన్ని నిలిపివేసి ప్రాజెక్టుల నిర్వహణపై దృష్టిపెట్టు. నీ రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణను బలిపెట్టకు. బనకచర్ల ద్వారా గోదావరిని చెరబట్టాలని చూస్తున్న ఏపీ కుట్రలను అడ్డుకో’ అని హితవు పలికారు.
నాడు నీటి రంగానికి అత్యంత ప్రాధాన్యమిచ్చి సాగు రంగాన్ని బాగుచేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. కానీ నేడు ప్రాజెక్టులను పడావుపెట్టి బాబు ఎదుట మోకరిల్లి ఆంధ్రకు నీళ్లొదులుతున్న ఘనత రేవంత్‌రెడ్డి సొంతమని ఎద్దేవా చేశారు. ‘మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగితే ఆగమేఘాలపై ఎన్డీఎస్ఏను పంపించిన కేంద్రంలోని బీజేపీ, ఉరుకుల పరుగులపై లేఖలు రాసిన ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి ఇప్పుడు అనేక ప్రాజెక్టులు ప్రమాదంలో పడిపోయినా, టన్నెళ్లు కూలినా ఎందుకు కనిపించడంలేదు’ అని నిలదీశారు.