సిద్దిపేట/నారాయణరావుపేట, మార్చి 23: వడగండ్ల వానతో చాలా గ్రామాల్లో పంట నష్టం జరిగినందున ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లిలో శనివా రం రాత్రి కురిసిన వడగండ్ల వానకు నష్టపోయిన రైతు ఎల్కపల్లి నర్సింలు వరి పంటను, రైతు రామస్వామి బొప్పాయి తోటను ఆదివారం హరీశ్‌రావు పరిశీలించారు. రైతులతో మాట్లాడి నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రూ.2 లక్షల పంట రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీఇచ్చి సంపూర్ణంగా చేయలేదని దుయ్యబట్టారు.
రూ.2లక్షలకు పైన రుణం ఉన్న రైతులతో పైన డబ్బులు చెల్లించి రుణమాఫీ చేయకుండా ప్రభుత్వం మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుబంధు రూపంలో కేసీఆర్ రైతులకు నేరుగా సహాయం చేశారని, 11 విడతల్లో రూ.73 వేల కోట్లు రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమచేసిన విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతుభరోసా ఎకరాకు రూ.7500 చొప్పున వానకాలం, యాసంగి పంటలకు సంబంధించి రూ. 15 వేల చొప్పున వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒక్క వరంగల్ జిల్లాలో 1.50 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని, దీనికారణం కాంగ్రెస్ వైఫల్యం అని ధ్వజమెత్తారు.