హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మున్సిపాలిటీలకు ఎన్ని నిధులు మంజూరు చేసిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. కొత్తగా ఎన్ని మున్సిపాలిటీలు ఏర్పాటుచేశామన్నది ముఖ్యం కాదని, ఎంత మేరకు అభివృద్ధి చేశామన్నదే ముఖ్యమని స్పష్టంచేశారు. మున్సిపాలిటీ సవరణ బిల్లుపై ఆదివారం అసెంబ్లీలో జరిగిన చర్చలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. కొన్ని మున్సిపాలిటీల్లో గ్రామ పంచాయతీలను చేరుస్తూ గతంలో ఇచ్చిన ఆర్డినెన్స్‌ను సభ ముందుకు తీసుకొచ్చారని, ఆ బిల్లును పూర్తిగా సమర్ధిస్తున్నామని, మద్దతిస్తున్నామని చెప్పారు.
మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి వద్దనే ఉన్నదని, కానీ, మున్సిపాలిటీలకు నిధులు ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నెల, నెల పట్టణ ప్రగతి కింద మున్సిపాలిటీలకు నిధులు ఇచ్చేవాళ్లమని, కానీ కాంగ్రెస్ సర్కారు ఇప్పటివరకు పట్టణ ప్రగతి కింద నిధులు విడుదల చేయలేదని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగని కారణంగా ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కూడా రావడం లేదని పేర్కొన్నారు.
లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) విషయంలో గతంలో బీఆర్ఎస్పై కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారని, కాంగ్రెస్ వస్తే ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని చెప్పారని హరీశ్‌రావు గుర్తుచేశారు. ‘నో ఎల్ఆర్ఎస్, నో బీఆర్ఎస్’ ప్రచారం చేసి, ఇప్పుడేమో ఎల్ఆర్ఎస్కు డబ్బులు వసూలు చేస్తున్నదని విమర్శించారు. మళ్లీ ప్రజలు ‘నో ఎల్ఆర్ఎస్, నో కాంగ్రెస్’ అనే రోజు వస్తుందని హెచ్చరించారు. తమ ప్రభుత్వంలోనే ఎల్ఆర్ఎస్ జీవో తెచ్చామని, మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కొంత డబ్బు కేటాయించామని గుర్తుచేశారు.
ఎల్ఆర్ఎస్ ద్వారా వచ్చిన డబ్బులను ఎన్ని మున్సిపాలిటీలకు, పట్టణాలకు ఎప్పటిలోగా ఇస్తారని ప్రశ్నించారు. అలాగే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా మున్సిపాలిటీలో అయ్యే రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయంలో కొంతమేరకు ఆ పట్టణ అభివృద్ధి సంస్థకు ఇవ్వాలని సూచించారు. నిధులు ఇవ్వకుంటే మున్సిపాలిటీలు ఎట్లా నడవాలని ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు కూడా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ (ఎస్డీఎఫ్) ఇచ్చేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు ఇవ్వడం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు చెప్పారు.
బీఆర్ఎస్ హయాంలో పల్లె ప్రగతి ద్వారా గ్రామాలకు నిధులు కేటాయించామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి గ్రామాల అభివృద్ధికి రూపా యి కూడా కేటాయించడంలేదని బాల్కొం డ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ సర్కారు 20 నెలలుగా గ్రామాలకు ఎలాంటి నిధులు కేటాయించకపోవడంతో ట్రాక్టర్‌కు డీజిల్ కొట్టించలేని, బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు చేయలేని పరిస్థితి ఉన్నదని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన విధంగానే కాంగ్రెస్ సర్కారు కూడా గ్రామాలకు నిధులు మంజూరు చేయాలని కోరారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా అనేక రోడ్లు దెబ్బతిన్నాయని, వాటికి తక్షణమే మరమ్మతు చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఏ శాఖను అడిగినా డ బ్బులు రాలేదని అంటున్నారని, మరి రోడ్ల ను ఎలా రిపేర్ చేస్తారని ప్రశ్నించారు. కొత్త మున్సిపాలిటీల అభివృద్ధికి ఇతోధికంగా నిధులు కేటాయించాలని బీజేపీ ఎమ్మెల్యేలు పాల్వాయి హరీశ్‌బాబు, పాయిల శంకర్ కోరారు.