మల్కాజిగిరి, ఆక్టోబర్ 14: ప్రొఫెసర్ సాయిబాబాపై అక్రమ కేసులుపెట్టి జైలు పాలు చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. మౌలాలిలో ప్రొఫెసర్ సాయిబాబా పార్థివ దేహంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు, హరీశ్‌రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రొఫెసర్ సాయిబాబా దివ్యాంగుడైనా తొమ్మిదేండ్లు అక్రమంగా జైలులో ఉంచారని విమర్శించారు. ఢిల్లీ యూనివర్సిటీ ఉద్యోగం నుంచి తొలగించారని తెలిపారు. చివరికి ఆయనను సుప్రీంకోర్టు నిర్దోషిగా తేల్చిందని చెప్పారు. ఆ సమయంలో ఆయన కుటుంబం మానసిక క్షోభ అనుభవించిందని, ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. సుప్రీంకోర్టు తీర్పుతో నిర్దోషిగా విడుదలైన సాయిబాబా కుటుంబంతో ఆనందంగా గడుపుతున్న సమయంలో మృత్యువు ఆయనను పొట్టనపెట్టుకున్నదని పేర్కొన్నారు. సాయిబాబాకు నివాళులర్పించిన వారిలో ఎమ్మెల్సీలు దేశపతి, కోదండరాం, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, నాయకులు పెద్ది సుదర్శన్, దేవీప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్, మల్లేపల్లి లక్ష్మయ్య తదితరులు ఉన్నారు.
గన్‌పార్క్ వద్ద కొద్దిసేపు సంతాప సమావేశం ఏర్పాటు చేస్తామని కుటుంబసభ్యులు, అభిమానులు కోరగా.. పోలీసులు అనుమతించలేదు. దీంతో సాయిబాబా అభిమానులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకానొక దశలో తోపులాట వరకూ వచ్చింది. తాము ప్రభుత్వ పెద్దలతో మాట్లాడామని, మంత్రులు కూడా అనుమతి ఇచ్చారని చెప్పినా పోలీసులు అనుమతించలేదు. అంబులెన్స్‌లోని సాయిబాబా పార్థివదేహాన్ని దించేందుకు కూడా ఒప్పుకోలేదు. దీనిపై పౌర హక్కుల, ప్రజా సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని, పౌర హక్కులను కాపాడతామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు.. ఇలా తమ హక్కులను హరించడం ఏమిటని నిలదీశారు. అంబులెన్స్‌లోనే ప్రొఫెసర్ పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మీడియాతో మాట్లాడారు.. పుస్తకాలు కాకుండా సమాజాన్ని చదివేవారు మేధావులని అన్నారు. సాయిబాబా అలాంటి వ్యక్తి అని కొనియాడారు.
బన్సీలాల్‌పేట్: సికింద్రాబాద్‌లోని గాంధీ వైద్య కళాశాల అనాటమీ విభాగానికి ప్రొఫెసర్ సాయిబాబా (57) భౌతికదేహాన్ని సోమవారం అప్పగించారు. ప్రజా సంఘాల నాయకులు, అభిమానులు జోహార్ సాయిబాబా సార్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీగా తరలివచ్చారు. మౌలాలిలోని స్వగృహం నుంచి సాయిబాబా భౌతికదేహాన్ని వాహనంలో కుటుంబ సభ్యులు గాంధీ వైద్య కళాశాల వద్దకు తరలించారు. ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కే రవిశేఖర్‌రావు మాట్లాడుతూ వైద్య విద్యార్థుల పరిశోధనకు ఉపయోగపడేందుకు ప్రొఫెసర్ సాయిబాబా భౌతికదేహాన్ని అప్పగించి, ఎందరికో ఆదర్శంగా నిలిచిన వారి కుటుంబసభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా సోదరుడు రాందేవ్, భార్య వసంత, కుమార్తె మంజీర, సీపీఐ కార్యదర్శి నారాయణ, పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్, ప్రొఫెసర్ కాశీం, ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, జర్నలిస్టులు పాశం యాదగిరి, వేణుగోపాల్, పాండు రంగారావు, చిక్కుడు ప్రభాకర్, గాదె ఇన్నయ్య, అంబటి నాగయ్య, సంధ్య, సజయ, పద్మకుమారి, అంజమ్మ, మీరా సంఘమిత్ర, విరసం అధ్యక్షుడు ఏ కృష్ణ, కార్యదర్శి రివేరా, పాణి, అమ్మ నేత్ర, అవయవ దాన ప్రొత్సాహకుల సంఘం అధ్యక్షురాలు గుత్తా జోత్పన, ఉద్యమకారుల జేఏసీ చైర్మన్ ఎస్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): పౌరహకుల ఉద్యమకారుడు, ఢిల్లీ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా మరణం సర్కారీ హత్యేనని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ ఆరోపించారు. హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం(మగ్ధూంభవన్)లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ ఏపీ కార్యదర్శి కే రామకృష్ణతో కలిసి ఆయన మాట్లాడారు. ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి అని తేల్చిన న్యాయస్థానం, పదేళ్ల పాటు ఆయనను జైలులో మగ్గేలా చేసిన దోషులెవరో తేల్చాలని కోరారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సీపీఐ తరఫున లేఖ రాశారు. సుప్రీంకోర్టులో కేసు కూడా దాఖలు చేయనున్నట్టు వెల్లడించారు. సాయిబాబాకు జరిగిన అన్యాయంపై ప్రజాతంత్రవాదులు, మేధావులతో పాటు వివిధ వర్గాల ప్రజలను సమీకరించి పెద్దఎత్తున చర్చను లేవదీయనునట్టు తెలిపారు. కేంద్రం హోంమంత్రిగా ఉన్న అమిత్ షా 2026 నాటికి అర్బన్ నక్సలైట్లను ఏరివేస్తామని ప్రకటించడాన్ని సీపీఐ ఖండిస్తున్నదని తెలిపారు. ‘ఉపా’ చట్టాన్ని సమీక్షించాలని ఏపీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు.