Harish Rao | శంషాబాద్ రూరల్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): ‘పురుగుల అన్నం పెడుతున్నారని ప్రశ్నించినందుకు విద్యార్థులను ఇష్టమొచ్చినట్టు కొడతారా? తక్కువ జాతి అంటూ కులదూషణలు చేస్తారా? ఆడపిల్లలు రోడ్డెక్కి ధర్నా చేస్తే సీఎం ఏం చేస్తున్నారు? ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం తప్ప పాలన మీద దృష్టిలేకపోవడం విడ్డురంగా ఉన్నది’ అని సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీమంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
శనివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకులలోని కస్తూర్బాగాంధీ గిరిజన హాస్టల్‌ను మాజీమంత్రి సబితాఇంద్రారెడ్డితో ఆయన కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పిల్లలంతా ఒక్కసారిగా హరీశ్ వద్దకు వచ్చి తమ సమస్యలన్నింటినీ ఏకరువు పెట్టారు. ఇన్ని రోజులుగా పడుతున్న యాతనను పూసగుచ్చినట్టు వివరించారు. పురుగుల అన్నం పెడుతున్నారని ప్రశ్నించినందుకు ఉపాధ్యాయులు వాతలొచ్చేలా కొడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
వారి బాధను వింటూ హరీశ్‌రావు సైతం కంటతడి పెట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలీక కిలోమీటర్ దూరం పరుగెత్తి రోడ్డెక్కి ధర్నా చేసే పరిస్థితి వచ్చిందంటే లోపం ఎక్కడున్నదో అర్థం అవుతున్నదని తెలిపారు. నాణ్యమైన భోజనం, తాగునీరు, సరైన దుస్తులు లేవని ఆవేదన చెందుతుండటం బాధాకరమని అన్నారు. విద్యార్థులను ఉపాధ్యాయులు వాతలొచ్చేలా కొడుతున్నారని, కులంపేరుతో దూషిస్తున్నారని చెప్తూ విద్యార్థులు ఏడుస్తున్నారని వెల్లడించారు.
ఒక విద్యార్థి టీచర్ కొట్టిన దెబ్బలకు గాయమైన చేతిని చూపుతూ ఏడుస్తున్న తీరు తనను ఎంతగానో కలచివేసిందని చెప్పారు. ‘ఇప్పటి వరకు ఒక జత బట్టలే ఇచ్చారు. మరో జత అడిగితే ఇవ్వటం లేదు. పుస్తకాలు సైతం ఇవ్వటం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలు, కస్తూర్బాగాంధీ హాస్టల్స్ పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. కేసీఆర్ పాలనలో సన్నబియ్యంతో అన్నం పెడితే ఈ సర్కారు గొడ్డుకారం పెడుతున్నది. ఇప్పటివరకు గురుకులాల్లో 500 మంది దవాఖాన పాలయ్యారు. 38 మంది పిల్లలు చనిపోయారు. పాములు కరిచి చనిపోతున్నారు. ఎలుకలు కొరికి దవాఖానల్లో చేరుతున్నారు. ఒకప్పుడు గురుకులాల్లో చదవటం ఒక కల.. ఇప్పుడు ఆవేదనగా మారింది’ అని తెలిపారు.
మేమున్నాం.. మీ పిల్లలకేం కాదు
‘మేము ఉన్నం.. మీ పిల్లలకు ఏమీ కాదు. భయపడొద్దు’ అని పాలమాకుల కస్తూర్బాగాంధీ హాస్టల్ విద్యార్థుల తల్లిదండ్రులకు హరీశ్‌రావు భరోసానిచ్చారు. పిల్లలకు ఎలాంటి ఇబ్బందులున్నా తనకు సమాచారమివ్వాలని ఫోన్ నంబర్ ఇచ్చినట్టు ఆయన తెలిపారు. హాస్టల్‌ను సందర్శించిన వారిలో బీఆర్ఎస్ నాయకుడు కార్తీక్‌రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డిజిల్లా డీసీసీబీ డైరెక్టర్ బుర్కుంట సతీశ్, దిద్యాల శ్రీనివాస్, మంచర్ల మోహన్‌రావు, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
గురుకులాలను గాలికి వదిలేశారు
‘సీఎం రేవంత్‌రెడ్డి విద్యాశాఖమంత్రిగా ఉన్నారు. ఆయన విద్యాశాఖ నిర్వహణలో పూర్తిగా విఫలమయ్యారు. మైనార్టీ గురుకులాలకు జనవరి నుంచి మెస్ బిల్లులు ఇవ్వలేదు. రాష్ట్రంలోని అన్ని గురుకులాల్లో కాస్మెటిక్ చార్జీలు, కరెంట్ బిల్లులు ఇవ్వకపోవటం ఏమిటి?’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. సీఎం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం మాజీమంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ సీఎం గురుకులాలను గాలికి వదిలేశారని ఆరోపించారు. పిల్లలు భయపడుతున్నారని, ఉపాధ్యాయులను మార్చి కొత్తవారిని తీసుకురావాలని సూచించారు. ఆడపిల్లల రోదన మంచిది కాదని, వారి బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ధర్నాకు దిగారని వెల్లడించారు.
‘పురుగుల అన్నం తింటున్నాం. కలుషిత నీళ్లు తాగుతున్నాం. ఇదేంటని అడిగితే అమ్మాయిలం అని కూడా చూడకుండా వాతలొచ్చేలా కొడుతున్నారు. ఇదిగో చూడండి నా చేతిపై వాత. మాకిక్కడ చాలా భయంగా ఉన్నది. మా తల్లిదండ్రులను కలవనిస్తలేరు. వారిని లోనికి అనుమతిస్తలేరు. మీలాంటి తక్కువ జాతి వాళ్లకు ఇదే ఎక్కువ అంటూ కూలదూషణ చేస్తున్నారు. చదువు కూడా సక్కగా జెప్పట్లేదు. గైడ్స్ చూస్కొని రాస్కొండంటుండ్రు. మేము ఇక్కడ ఉండలేం. దయచేసి మమ్మల్ని ఆదుకోండి’
– హరీశ్‌రావుతో పాలమాకుల కస్తూర్బా కాలేజీ విద్యార్థులు