ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ చేసిన హెచ్చరికలు ఒకొకటిగా నిజమవుతున్నయి. తెలంగాణ పాలిట బనకచర్ల పెను ప్రమాదంగా మారబోతున్నా ముఖ్యమంత్రి నోరెత్తుతలేడు. నీ కమీషన్ల కోసం మౌనంగా ఉంటున్నవా? కాంట్రాక్టుల్లో వాటా ఉన్నదా? ఎందుకు మౌనంగా ఉంటున్నవ్ రేవంత్‌రెడ్డీ?
– మాజీమంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ సహకారంతో బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ ఏపీ ప్రభుత్వం ముందుకుపోతుంటే సీఎం రేవంత్‌రెడ్డి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటూ ఏపీకి పూర్తిగా సహకరిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. టెక్నో ఎకనామికల్ అప్రైజల్ కోసం బనకచర్ల ప్రాజెక్టు పీఎఫ్ఆర్ వచ్చిందని, అనుమతుల ప్రక్రియ ప్రోగ్రెస్‌లో ఉన్నదని జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ సెప్టెంబర్ 23న సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారని, 20 రోజులైనా దాన్ని వ్యతిరేకించాల్సింది పోయి పరోక్షంగా సహకరిస్తున్నారని నిప్పులు చెరిగారు. మన దేశంలో వరద జలాల మీద డీపీఆర్ అప్రైజల్ ఉండదని, నికర జలాల మీద డీపీఆర్ ఉంటుందని, కానీ వరద జలాల మీద ఉండదని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), నదీ జలాల పంపిణీ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. వరద జలాల మీద డీపీఆర్ అప్రైజల్ను వ్యతిరేకిస్తూ కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి లేఖ రాస్తే రేవంత్‌రెడ్డి మాత్రం మౌనంగా ఉన్నారని ధ్వజమెత్తారు. తెలంగాణభవన్‌లో శనివారం ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీలు ఎల్ రమణ, దాసోజు శ్రవణ్‌తో కలిసి హరీశ్ మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి పాటిల్ రాసిన లేఖను, మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు కేంద్రానికి పంపిన లేఖలను మీడియాకు చూపించారు. బనకచర్ల పురోగతి.. తాజా పరిణామాలను మీడియా సాక్షిగా ప్రజల ముందు బయట పెడుతున్నానని చెప్పారు. బనకచర్ల డీపీఆర్ కోసం రూ.9కోట్లకు ఏపీ సర్కారు టెండర్లు కూడా పిలిచిందని, అయినా మన సీఎం మొద్దునిద్ర పోతున్నారని విమర్శించారు.
మొత్తంగా 423 టీఎంసీలు ఏపీ తీసుకువెళ్తే మేము 112 టీఎంసీల నీళ్లు కృష్ణాలో ఆపుకొంటామని కర్ణాటక ప్రభుత్వం కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖకు లేఖ రాసిందని హరీశ్ వివరించారు. ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ ప్రకారం గోదావరి నీళ్లు తరలించుకుంటే మరుసటి రోజు నుంచి కృష్ణా మీద నీళ్లు ఆపుతామని చెప్పిందని తెలిపారు. అంటే 423 టీఎంసీల గోదావరి జలాలు ఏపీ అర్పణం, 112 టీఎంసీల కృష్ణా జలాలు కర్ణాటకకు అర్పణమైతే తెలంగాణ మిగిలేదేమిటని ఆయన ప్రశ్నించారు.
బనకచర్ల టెక్నో ఎకనామికల్ అప్రైజల్‌పై మహారాష్ట్ర తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కేంద్రానికి లేఖరాసిందని హరీశ్ చెప్పారు. వరద జలాల మీద ప్రాజెక్టు నిబంధనలు దేశంలో లేవని, ఒకవేళ ఉంటే తాము కూడా కట్టుకుంటామని పేర్కొన్నట్టు వెల్లడించారు. ‘అసలు ఫ్లడ్ వాటర్ మీద ముందుకు వెళ్ల కూడదు. ఒకవేళ వెళ్తే మహారాష్ట్ర వాటా ఎంతో చెప్పండి. వరద జలాల మీద ప్రాజెక్టు కట్టేందుకు ఏపీకి అవకాశం ఇస్తే మేము కూడా కట్టుకునేందుకు డీపీఆర్‌లు పంపుతం. కృష్ణాలో 74 టీఎంసీల మా వాటా ఆపుకొంటం. వరద ప్రాజెక్టులు కడుతం. విదర్భకు నీళ్లు తీసుకుపోతం’ అని మహారాష్ట్ర కేంద్రానికి రాసిన లేఖ పేర్కొన్నదని వివరించారు. ‘కర్ణాటక 112 టీసీఎంల నీళ్లు ఆపుకొంటామంటది. మహారాష్ట్ర కూడా కృష్ణాలో 74 టీఎంసీలు ఆపుకొంటామంటది. గోదావరిపై ప్రాజెక్టు కట్టి విదర్భకు నీళ్లు తీసుకుపోతామంటున్నది. తెలంగాణ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. ఇంత స్పష్టంగా ఆయా రాష్ట్రాలు ముందుకు పోతుంటే మన ప్రభుత్వం ఏం చేస్తున్నది? మొద్దు నిద్ర పోతున్నదా?’ అని నిలదీశారు.
కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖకు 2025, సెప్టెంబర్ 17న ‘కర్ణాటక ప్రభుత్వం లేఖ రాసింది. 80, 100, 243 మొత్తంగా 423 టీఎంసీలు ఏపీ తీసుకువెళ్తే మేము 112 టీఎంసీల నీళ్లు కృష్ణాలో ఆపుకొంటామని చెప్పింది. ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ ప్రకారం గోదావరి నీళ్లు తరలిస్తే.. మరుసటి రోజు నుంచి మీద నీళ్లు ఆపుతమన్నది. మరి తెలంగాణ నష్టపోదా? ఇటు కింద గోదావరి నీళ్లను ఏపీ, అటు కృష్ణా మీద కర్ణాటక నీళ్లు ఆపితే తెలంగాణ పరిస్థితి ఏంగావాలె?
– హరీశ్‌రావు
పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు సా ధ్యం కాదని సెంట్రల్ వాటర్ కమిషన్, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్, పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఇప్పటికే స్పష్టం చేశాయని హరీశ్ గుర్తుచేశారు. అప్పుడు తప్పు అని చెప్పిన కేంద్రం.. ఇప్పుడు ఎందుకు ముందుకు పోతున్నదని ప్రశ్నించారు. ‘టెక్నో ఎకనామికల్ అప్రైజల్ ప్రాసెస్‌లో ఉన్నదని కేంద్రం ఎలా చెప్తుంది? సీడబ్లూసీనే వరద జలాలు ఎలా తరలిస్తారని రాసింది. ఈ ఆధారం పట్టుకొని సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లడం లేదు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కి బాధ్యత లేదా? ఏపీ మన నీళ్లు తన్నుకుపోతుంటే రేవంతరెడ్డి, కిషన్‌రెడ్డి, బండి సంజయ్ పెదవులు మూసుకుంటున్నరు. మాయల ఫకీరు ప్రాణం చిలుకలో ఉన్నట్టు.. కేంద్ర ప్రభుత్వ ప్రాణం చంద్రబాబు చేతిలో ఉన్నందున ఈ రోజు బాబు ఒత్తిడికి బీజేపీ తలొగ్గుతున్నది. పోలవరం జాతీయ ప్రాజెక్టు. దానికి ఇప్పటికే డీపీఆర్ ఉన్నది. కేంద్రం నిర్మించే పోలవరానికి బనకచర్ల పేరిట అడ్డగోలుగా కాల్వలు పెంచితే ఎందుకు కేంద్రం మౌనంగా ఉంటున్నది?’ అని నిలదీశారు.
‘టెండర్ బిడ్ డాక్యుమెంట్లో పేజీ 79లో ఉన్న దాని ప్రకారం.. పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ద్వారా 23వేల క్యూసెకులు మళ్లించేలా రూపకల్పన చేశారు. నిజానికి 11,500 క్యూసెకులు మాత్రమే దాని కెపాసిటీ. ఇప్పుడు 23వేల క్యూసెక్కుల కెపాసిటీతో పోలవరం రైట్ మెయిన్ కెనాల్ తవ్వుతున్నారు. అంటే కేంద్రం ఏం చేస్తున్నది? బీజేపీది రాష్ట్రానికో నీతా? నిబంధనలు ఉల్లంఘించి తవ్వుతుంటే బీజేపీ ఎందుకు నిధులిస్తున్నది? ఆనాడు కెనాల్‌ను 18 వేలకు పెంచితేనే బీఆర్ఎస్ ప్రభుత్వం కొట్లాడింది. కేంద్రం డబ్బులు ఆపింది. రేవంత్ వచ్చాక ఇప్పుడు కెనాల్‌ను 18 వేల నుంచి 23 వేల క్యూసెకులకు పెంచుతున్నది. తవ్వుతున్న ఏపీది తప్పుయితే, సహకరించిన బీజేపీది కూడా తప్పే’ అని పేర్కొన్నారు.
ఏపీ ప్రభుత్వం బనకచర్ల డీపీఆర్ కోసం రూ.9 కోట్లకు టెండర్లు పిలిచింది. టెక్నో ఎకనామికల్ అప్రైజల్ కోసం బనకచర్ల పీఎఫ్ఆర్ వచ్చింది.. అనుమతుల ప్రక్రియ ప్రోగ్రెస్‌లో ఉన్నది.. ప్రాసెస్ చేస్తున్నమని కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ 2025, సెప్టెంబర్ 23న సీఎం రేవంత్‌రెడ్డికి ఉత్తరం రాసిండ్రు. దాన్ని వ్యతిరేకించాల్సింది పోయి రేవంత్‌రెడ్డి పరోక్షంగా సహకరిస్తున్నడు.
-హరీశ్‌రావు
అడ్డగోలుగా కాలువలు తవ్వి తెలంగాణ నీళ్లను ఏపీ తన్నుకుపోతుంటే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నదని హరీశ్ ప్రశ్నించారు. ‘న్యాయవాదులతో కేసీఆర్ మాట్లాడుతున్నారు. సీఎ రేవంత్‌రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లకున్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పోరాడుతది. సుప్రీంకోర్టుకు వెళ్లి హకులను కాపాడుతుంది. తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేసేది బీఆర్ఎస్, కేసీఆర్ మాత్రమే’ అని హరీశ్ స్పష్టంచేశారు.
‘గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ సర్వస్వం కోల్పోతుంటే రేవంత్‌రెడ్డి సైలెంట్ మోడ్‌లో ఉన్నడు. వరద జలాల మాట దేవుడెరుగు. ఉన్న నీళ్లు పోయేటట్టున్నయి. రేవంత్‌రెడ్డి తెలంగాణ ద్రోహి. ఎన్నడూ జై తెలంగాణ అనలే. ఎన్నడూ అమరుల స్తూపం వద్దకు పోలే. ఒకనాడు రాజీనామా చేయలే. క్యాబినెట్లో తెలంగాణ సోయి ఉన్న ఒక మంత్రి కూడా లేడా? ఉత్తరాలు వచ్చిన విషయం వారికి తెల్వదా?’ అని హరీశ్ నిలదీశారు.
‘బనకచర్లను అడ్డుకోవడం..కృష్ణాలో నీటి వాటాల సాధనలో విఫలమైన సీఎం రేవంత్‌రెడ్డి..ఆల్మట్టి ఎత్తుపైనా మౌనం వహిస్తున్నడు. మొన్న కర్ణాటకకు పోయి సాధించిందేటి? మీ పార్టీ పెద్ద మల్లికార్జున్ ఖర్గేను కలిసి కనీసం అక్కడి సీఎం సిద్ధరామయ్యకు ఫోన్ చేయించకపోతివి? ఎత్తుపెంచితే తెలంగాణ ఏడారైతది.. జర ఆపండని అడగకపోతివి? అక్కడి నీటిపారుదల శాఖ మంత్రి శివకుమార్‌తో నీకు సఖ్యత ఉన్నది కదా? ఇస్తినమ్మ వాయినం.. పుచ్చుకుంటిన్నమ్మ వాయినం చందంగా ఇద్దరి మధ్య మాటలే కాదు.. మూటల మార్పిడి జరుగుతది కదా? మూటల సంగతి పక్కనబెట్టి ఆల్మట్టి ఎత్తు పెంచొద్దని ఒక్కమాటైనా చెప్పకపోతివెందుకు? ’ అంటూ హరీశ్ ప్రశ్నల వర్షం కురిపించారు. కర్ణాటకకు పోయి ఆల్మట్టిని మరిచిపోయి ఆల్ ఈజ్ వెల్ అనుకుంటూ వచ్చాడని ఎద్దేవా చేశారు. అయినదానికి, కానిదానికి ఢిల్లీకి పోయి తెలంగాణకు ఒరగబెట్టిందేమిటని నిలదీశారు.
రాష్ట్ర నీటిహక్కులపై అవగాహనలేని ముఖ్యమంత్రి.. మంత్రులు పూటకో మాట.. ఘడియకో లెక్క చెప్తున్నారని హరీశ్ ధ్వజమెత్తారు. వారికి పాలమూరు తలాపున పారుతున్న కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తెలియకపోవడం విడ్డూరమని నిప్పులు చెరిగారు. ‘ఒకసారి కృష్ణాలో 500 టీఎంసీలు, గోదావరిలో 1000 టీఎంసీలు కేటాయించి ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకోండి అని ఏపీ సీఎం చంద్రబాబుకు ఓపెన్ ఆఫర్ ఇస్తరు..ఇంకోసారి కృష్ణాలో 904 టీఎంసీల వాటా కోసం కొట్లాడుతున్నమని పొంకనాలు కొడుతరు.. నీళ్ల మంత్రేమో ఢిల్లీకి పోయి ట్రిబ్యునల్ ముందు 763 టీఎంసీలు అడుగుతున్నమంటరు..ఇలా రోజుకో వైఖరిని ప్రదర్శిస్తూ తెలంగాణ పరువుతీస్తున్నరు’ అని విరుచుకుపడ్డారు. ‘రాష్ట్ర నీటి హక్కులపై స్పష్టతలేని ఆయన ట్రిబ్యునల్ ఎదుట ఏం వాదిస్తరు? ఏం సాధిస్తరు? రేవంత్‌రెడ్డీ..ఢిల్లీకి ఎప్పుడూ బ్యాగులు మోసుడే కాదు..అప్పుడడప్పుడు తెలంగాణ ప్రజల బాగోగులు కూడా చూడు’ అంటూ చురకలంటించారు.
కాంగ్రెస్ సర్కారు అవగాహనలేమి, అడ్డగోలు వ్యవహారాలతో తెలంగాణ నీటి హక్కులకు తీవ్ర విఘాతం కలుగుతున్నదని హరీశ్ ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ తొమ్మిదేండ్లు పోరాడి నీళ్ల కోసం తండ్లాడి సుప్రీంకోర్టు మెట్లెక్కి ట్రిబ్యునల్‌ను సాధించారని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ట్రిబ్యునల్ ప్రకారమే నీళ్ల పంపిణీ చేయాలని కోరారని స్పష్టంచేశారు. బీఆర్ఎస్ హయాంలోనే వాదనలు సుగమయ్యాయని పేర్కొన్నారు. కేసీఆర్ నీళ్ల వాటాల కోసం అలుపెరగని కృషి చేస్తే రేవంత్‌రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకు ధారాదత్తం చేస్తున్నాడని విమర్శించారు. ‘నీటి హక్కులను రాసిస్చేందుకు నువ్వెవరు రేవంత్‌రెడ్డీ? అని నిలదీశారు.
పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ద్వారా 23 వేల క్యూసెకులు మళ్లించేలా రూపకల్పన చేసిండ్రు. నిజానికి 11,500 క్యూసెకులు మాత్రమే దాని కెపాసిటీ. ఇప్పుడు డబుల్ కెపాసిటీతో పోలవరం రైట్ మెయిన్ కెనాల్ తవ్వుతున్నరు. మరి కేంద్రం ఏం చేస్తున్నది? సామర్థ్యానికి మించి కాలువ తవ్వుతుంటే కేంద్రం ఎందుకు ఆపడం లేదు?
-హరీశ్‌రావు
తెలంగాణ నీటి హక్కుల కోసం నాటి నుంచి నేటి వరకు పోరాటం చేస్తున్నది కేసీఆర్.. బీఆర్ఎస్సేనని హరీశ్ స్పష్టంచేశారు. ఎప్పటికప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీస్తున్నదని తమ పార్టీయేనని పునరుద్ఘాటించారు. ఆల్మట్టి ఎత్తు పెంపుపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు లాయర్లు, న్యాయనిపుణులతో కేసీఆర్ చర్చలు జరుపుతున్నారని చెప్పారు. ‘జాతీయ పార్టీలను గెలిపిస్తే తెలంగాణకు ఒరిగిందేమీలేదు.. కేసీఆర్ లేకుంటే తెలంగాణను ఆగం చేస్తరు..అగాథంలోకి తోస్తరు..అనాథగా మారుస్తరు’ అని జాగృతపరిచారు. తెలంగాణకు జల హక్కులు దక్కాలంటే కేసీఆర్‌ను, బీఆర్ఎస్ను కాపాడుకోవాలని, మేధావులు, ప్రజాసంఘాల నాయకులు, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఆలోచించాలని కోరారు.
‘రేవంత్‌రెడ్డి తొలుత పోను అనుకుంటూనే ఢిల్లీకి పోయి అపెక్స్ మీటింగ్‌లో కూర్చున్నడు. అసలు బనకచర్ల అంశం మీటింగ్ ఎజెండాలోనే లేదు.. కనుక చర్చే జరగలేదని బుకాయించి రాష్ట్ర ప్రజలను మోసం చేసిండు. ఎజెండాలో బనకచర్ల అంశం ఉన్నదని బీఆర్ఎస్ ఆధారాలతో సహా బయటపెట్టింది. ఏపీ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు అసలు సంగతి బయటపెట్టారు. మీటింగ్‌లో బనకచర్లపై చర్చ జరిగిందని, ప్రాజెక్టు నిర్మాణాన్ని సుసాధ్యం చేసేందుకు కమిటీ ఏర్పాటైందని చెప్పిండ్రు. ఆలిండియా రేడియోలో ఈ వార్త వచ్చింది. దీంతో రేవంత్ నోట్లో పచ్చి వెలకాయ పడ్డది. చేసిన ద్రోహం.. బట్టబయలైంది. కమిటీకి రేవంత్‌రెడ్డి ఒప్పుకోవడమంటేనే బనకచర్లకు ఒప్పుకొన్నట్టు. కమిటీ ఏర్పాటుకు గంగిరెద్దులా తలూపారు. మహారాష్ట్ర, కర్ణాటక రాసిన లేఖలు అబద్ధ్దమా? కేంద్రం నుంచి 20 రోజులుగా ఉత్తరం వస్తే ఎందుకు కౌంటర్ ఇవ్వలేదు. నల్లమల గుండా పోయే కృష్ణా నీళ్లలో అన్యాయం జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నవు? నువ్వు నల్లమల పులివా? పిల్లివా? ఎలుకవా?’ అని హరీశ్ నిలదీశారు.