Harish Rao | హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): కనీసం అంబేద్కర్ విగ్రహానికి దండ కూడా వేయనివాళ్లు సామాజిక న్యాయ దినోత్సవాన్ని జరుపుతారా? అని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. బుధవారం ‘ఎక్స్’ వేదికగా కాంగ్రెస్ సర్కారుపై ఆయన ధ్వజమెత్తారు. కులగణన సర్వే చేశామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని, ఆ సంఖ్య మీద బీసీ సంఘాలే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రశ్నించిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం తప్ప.. వాస్తవ లెక్కలు బయటికి చెప్పడం లేదని మండిపడ్డారు.
అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి ఎస్సీ వర్గీకరణ తర్వాత ఉద్యోగ నియామకాలు పూర్తి చేస్తామని ప్రకటించారని గుర్తుచేశారు. పెట్టుబడులు, పరిశ్రమలు వాపస్ పోతుంటే, సిగ్గులేకుండా గొప్పలు చెబుతున్నారని మండిపడ్డారు. పరిశ్రమలు గుజరాత్, తమిళనాడు, ఏపీలకు తరలిపోతున్నాయని మీడియా కోడై కూస్తున్నదని పేర్కొన్నారు. 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని గొప్పలు చెబుతున్నారని కానీ, దావోస్‌లో జరిగే ఒప్పందాలు ‘ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్’ అని డిప్యూటీ సీఎం చెప్పారని తెలిపారు.
ఒప్పందాల్లో ఎన్ని గ్రౌండ్ అయ్యాయో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసు కుటుంబాలు రోడ్డెక్కాయని, పోలీసు సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటున్నామని గప్పాలు కొట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పొగడ్తలతో బడ్జెట్ ప్రసంగాన్ని గుదిగుచ్చారని ఆరోపించారు.