Harish Rao | హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులు, నిరుద్యోగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎప్పుడు నెరవేరుస్తారని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని, ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తామని, రూ.4వేల నిరుద్యోగ భృతి ఇస్తామని మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వాటిని ఎపుడు అమలు చేస్తారో చెప్పాలని నిలదీశారు. నియామకాలకు సంబంధించి గతంలో ఉన్న జీవో 55ను మార్చి, జీవో 29 తేవడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రూప్-2 పోస్టులు రెండువేలకు, గ్రూప్-3 పోస్టులు మూడు వేలకు పెంచుతామని ఎన్నికలకు ముందు చెప్పారని, బస్సుయాత్రలు పెట్టారని గుర్తు చేశారు. ఇప్పుడు న్యాయ సమస్యల వంక చెప్తున్నారన్నారని విమర్శించారు. 2015లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రూప్-2 పోస్టులను 435 నుంచి 1032కు పెంచినట్టు గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తక్షణం పెండింగ్ డీఏలు ఇస్తామని, మెరుగైన పీఆర్సీ ఇస్తామని మ్యానిఫెస్టోలో పేర్కొన్నారని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేస్తామన్నారని తెలిపారు. ఇవన్నీ ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలన్నారు.
గతంలో ఏటా మార్చి 31న రూ.5 కోట్లలోపు ఉన్న బిల్లులు క్లియర్ చేసేవాళ్లమని ఈసారి అలా జరగలేదన్నారు. కనీ సం రూ.కోటి లోపు ఉన్న బిల్లులను వెంట నే క్లియర్ చేయాలని కోరారు. కేంద్రం ఈజీఎస్ పథకం కింద రూ.800 కోట్లు వచ్చి 3 నెలలు అయ్యిందని, దానికి రాష్ట్ర గ్రాంటు రూ.350కోట్లు జమ చేయడం లేదన్నారు. రెండూ కలిపి 1100 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్‌శాఖ బాగా పనిచేస్తే వైద్యశాఖపై ఒత్తిడి తగ్గుతుందని, కానీ ఇప్పుడు దవాఖానలు రోగులతో నిండిపోయాయని తెలిపారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు పాత బకాయిలు చెల్లిస్తామని మ్యానిఫెస్టోలో పెట్టారని, ఇప్పుడు పాత బకాయిలు ఇవ్వబోమని అంటున్నారని మండిపడ్డారు. మ ధ్యాహ్న భోజనానికి సంబంధించి బిల్లులు విడుదల చేయాలని కోరారు. జూలై పెన్షన్ రిలీజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.